ఆంధ్రజ్యోతిపై కేటీఆర్‌ పరువునష్టం

హైదరాబాద్‌, జూన్‌ 24 (జనంసాక్షి) :
ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరెక్టర్‌, పత్రిక సంపాదకులు తదితరులపైన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేె కేటీ రామారావు సోమవారం పరువు నష్టం దావా వేశారు. ఆయన నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 499, 500ల కింద వారిపై కేసు నమోదు చేయాలని కేటీఆర్‌ తన పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌లో ఏ1గా ఆమోద బ్రాడ్‌ కాస్టింగ్‌ పబ్లికేషన్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, ఏ2గా వేమూరిరాధాకృష్ణ, ఏ3గా కనగంటి వెంకటశేష గిరిరావు, ఏ4గా సంపాదకుడు శ్రీనివాస్‌ను నిందితులుగా పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రజాప్రతి నిధిగా ఉన్న తనపై వ్యక్తిగతంగా దూషిస్తూ తనపరువును, పార్టీప్రతిష్టను దిగజార్చే విధంగా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ వార్తా సంస్థలు వ్యవహరిం చాయని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ పిటిషన్‌ పై విచారణ మంగళవారానికి వాయిదా పడిరది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. రాధాకృష్ణ కావాలనే తనపై విషం చిమ్ముతున్నారని మండిప డ్డారు. తమకు న్యాయ వ్యవస్థపె నమ్మకముందని, చట్టాలంటే గౌరవముందన్నారు. న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందన్నారు. అసత్య కథనాలు చట్ట పరిధిలో తేల్చుకునేందుకే కేసు వేసినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమంపై ఆంధ్రజ్యోతి విషం చిమ్ముతోందన్నారు. నిరాధారమైన ఆరోపణ లు చేస్తూ ఉద్యమాన్ని బలహీనపర్చేందుకు కుట్ర పన్నుతోందన్నారు.