ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పరిపాలన!
నెల్లూరు, జూన్ 16 (జనంసాక్షి) : ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో శుక్రవారంనాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటర్లు వెలువరించిన తీర్పు తాజాగా రాష్ట్రపతి పరిపాలనకు దారి తీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాత్రి నెల్లూరు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, 18 స్థానాలు గాను 15 స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ దక్కించుకోవడం వల్ల దీని ప్రభావం అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష టీడీపీల మీద పని చేసి ఆ పార్టీల ఎమ్మెల్యేలు అధిక సంఖ్యలో రాజీనామాలు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజమోహన్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఒకవేళ మైనార్టీలో పడిపోతే ఈ పరిణామం తాజాగా రాష్ట్రపతి పరిపాలకు దారి తీసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 15 సీట్లను దక్కించుకున్న నేపథ్యంలో తమ పార్టీలోకి తెలుగుదేశం, కాంగ్రెస్ నుంచి అధిక సంఖ్యలో వలస వచ్చే అవకాశం ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. పరకాల నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ అతిస్వల్ప తేడాతో ఓటమి పాలు కావడం వల్ల రాజమోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేస్తూ ఇది నైతికంగా కొండా సురేఖ విజయమేనని సమర్ధించుకున్నారు. నర్సాపురం, రామచంద్రాపురం అసెంబ్లీ సెగ్మెంట్లలో తమ పార్టీ ఓటమికి స్థానికంగా కుల సమీకరణలు, కాంగ్రెస్ తెలుగుదేశం కుమ్మక్కు కావడం ప్రధాన కారణాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ కాకాని గోవర్ధన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.