ఆంధ్రాలో కుండపోత వర్షం
– వాయుగుండం ప్రభావంతో అతలాకుతలం
విజయవాడ,మే18(జనంసాక్షి):
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంగా బుధవారం ఉదయం చెన్నైకి తూర్పు దిశగా 70 కిలోవిూటర్ల దూరంలో కేంద్రీకృతం అయిఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 11 కిలోవిూటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. ఈ వాయుగుండం చెన్నై నుంచి ఉత్తర దిశగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా వైపు పయనిస్తుందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది 48 గంటల్లో తీవ్ర వాయుగుండంగా, తదుపరి తుఫానుగా మారే అవకాశముందని అధికారులు వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో తమిళనాడులోని కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. చెన్నైలో ఈ దురుగాలులతో కూడి వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. చెన్నై నంగరంలోని చంబరంబాక్కం రిజర్వాయర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. చెన్నై శివారులో రాత్రి వరకు 17.7 సెం.విూ. వర్షపాతం నమోదైంది. నాగపట్నం, పుదుచ్చేరి, రామేశ్వరం ఓడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు, విల్లుపురం, తంజావూరు, నాగపట్నం, పుదుకొ?ట్టె, మధురై, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుంది. తమిళనాడులో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. రహదారులు జలమయ్యాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెన్నై నగరంలోని చంబరంబాక్కం రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. చెన్నై శివారులో రాత్రి వరకు 17.7 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలను ఎదుర్కొనేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ముందస్తుగా చెన్నైలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది.గత డిసెంబరులో ముంచెత్తిన భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. అరక్కోణం నుంచి 8 బృందాలు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని సమాయత్తంగా ఉంచింది. లోతట్టు ప్రాంతాలలో నిరంతరం పర్యవేక్షించి అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరగాల్సిన అంబేద్కర్ లా యూనివర్సిటీ న్యాయ విద్య సెమిస్టర్ పరీక్షలను వాయిదాపడ్డాయి.వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవిూక్ష నిర్వహించారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖ, చిత్తూరు జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి సహాయచర్యలపై ఆరా తీశారు. వాయుగండంగా మారనున్నందున అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సీఎస్ సహా ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. జనజీవనం స్తంభించకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి… వారికి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఇదిలావుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో కృష్ణా జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు.ఎ సూచించారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేస్తున్నామని… ప్రజల తరలింపులో వీఆర్వోలు, గ్రామ కార్యదర్శులు సహకరించాలని ఆదేశించారు. అన్ని మండల కేంద్రాల్లో నిత్యావసరాలు, తాగునీరు, ఔషధాలు సమకూర్చాలని తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. వడగళ్ల వాన సహా పిడుగులు పడే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.