ఆంధ్రోళ్ల స్థానికతకు ఆమోదం

3

– గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

న్యూఢిల్లీ,జూన్‌ 10(జనంసాక్షి): స్థానికతపై ఉద్యోగుల ఆందోళనకు తెరపడనుంది. దీనిపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లే పిల్లలకు స్థానికత కల్పించే అంశం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. 2017 జూన్‌ 2 నాటికి ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చే వారి పిల్లలకు వారు కోరుకున్న జిల్లాలో స్థానికత కల్పించేలా రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ పెట్టుకున్న అర్జీకి ఆమోదం దక్కింది. దీనిపై ఎపి  ప్రభుత్వం గతేడాది కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏపీ విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ దస్త్రాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. స్థానికత దస్త్రంపై శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోద ముద్రవేశారు. ఏపీలో స్థానికతపై కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. 2014 జూన్‌ 2నుంచి 2017 జూన్‌ 2లోపు ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లే ఉద్యోగులకు స్థానికత వర్తించనుంది.  నెల 27లోగా ఉద్యోగులంతా అమరాతికి తరలిరావాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. స్థానికత అంశం కొలిక్కి రాకపోవడంతో ఇప్పటి వరకూ ఉద్యోగులు సందిగ్ధంలో ఉన్నారు. స్థానికతపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో ఉద్యోగులకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. కేంద్రం నిర్ణయంపై ఏపీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేవారి స్థానికత అంశంపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోద ముద్ర వేయడంతో ఉద్యోగుల్లో ఉన్న ఆందోళన తొలడగిందనే భావించాలి. రాష్ట్ర విభజన తర్వాత మూడేళ్లలో ఏపీకి తిరిగి వచ్చేవారిని స్థానికత వర్తిస్తుంది. విభజన జరిగినప్పటి నుంచి మూడేళ్లలోపు.. అంటే జూన్‌ 2, 2017లోపు ఆంధప్రదేశ్‌కు తిరిగి వచ్చేవారినందర్నీ స్థానికులుగా గుర్తించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో దీనికి చట్టరూపం దాల్చింది.

కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న ప్రాంతాలమధ్య విద్య, ఉద్యోగాలకు సంబంధించి సమాన అవకాశాలు కల్పించేందుకు వీలుగా 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్‌ ‘371-డి’, ‘371-ఈ’లను చేర్చిన విషయం తెలిసిందే. ఆయా నిబంధనలను నిర్వచిస్తూ 1975లో ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులను జారీ చేశారు.  పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 97 ప్రకారం ఆంధప్రదేశ్‌, తెలంగాణ రాష్టాల్ల్రో ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయి. అయితే ఇప్పటికే తెలంగాణలో స్థిరపడి రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరిగి ఆంధప్రదేశ్‌కు వెళ్లాలనుకునేవారి విషయంలో స్థానికతను నిర్ధారించేందుకు ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజా సవరణను ప్రతిపాదించింది. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు-1975లోని పేరా 7ను సవరించాలని కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. స్థానికతపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో ఉద్యోగులు అమరావతికి వెళ్లేందుకు మార్గం సుగమమైందని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌ అన్నారు. ఏపీ ఉద్యోగుల సందేహాలకు ఈ నోటిఫికేషన్‌ సమాధానంగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు స్థానికత అనేది మంచి శుభపరిణామని ఆయన అన్నారు. ఏపీ ఉద్యోగులు అమరావతికి తరలివెళ్లి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కంభంపాటి కోరారు.

ఉద్యోగ సంఘాల హర్షం

స్థానికతకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంపై సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల తరలింపులో ప్రతిబంధకంగా ఉన్న స్థానికత ఉత్తర్వులు వచ్చేలా కృషి చేసిన చంద్రబాబుకు రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఎలాంటి ఆందోళన లేకుండా అమరావతికి వస్తామని ఆయన స్పష్టం చేశారు.