ఆజాద్‌ దిష్టిబొమ్మ దగ్ధం

నిజామాబాద్‌, జనవరి 29 (): తెలంగాణపై వ్యతిరేక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి ఆజాద్‌ దిష్టిబొమ్మను కోర్టు ఎదుట బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్బంగా టిజేఏసి చైర్మన్‌ గోపాల్‌ శర్మ మాట్లాడుతూ కేంద్ర మంత్రులు ఆజాద్‌, షిండేలు తెలంగాణపై నాన్చుడు ధోరణిని అవలంభిస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్‌ మంత్రులు, ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయకుండా, సోనియాగాంధీపై నమ్మకముందని ,తెలంగాణ వస్తుందని ప్రజలను వంచిస్తున్నారని అన్నారు. తెలంగాణ వస్తుందన్న ప్రతీసారి సీమాంధ్ర నాయకులు కేంద్ర నాయకులను కలిసి లాబీయింగ్‌ చేసి, తెలంగాణ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 28న తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామన్న కేంద్ర హోంశాఖ మంత్రి షిండే ప్రకటన మోసపూరితమైందని అన్నారు. ఇప్పటికే వెయ్యి మంది విద్యార్థులు చనిపోయారని, తెలంగాణ కోసం ఇంకెంత మందిని బలిగొట్టారో చెప్పాలన్నారు. అఖిలపక్షంలో తెలంగాణ రాదని టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసిఆర్‌ చెప్పారని అదే ఈ రోజు నిజమైందన్నారు. కేంద్రం తెలంగాణ ఇవ్వదని తేలిపోయిందని ఇక తెలంగాణలో ఉద్యమాన్ని ఉధృతం చేసి, తెలంగాణను సాధించుకొంటామన్నారు. ఈ కార్యక్రమంలో బార్‌  అసోసియేషన్‌ అధ్యక్షుడు లింబాగౌడ్‌, ఆశ నారాయణ, బిర్లా రామారావు, అశోక్‌, సాయిలు, రాజ్‌కుమార్‌ సుబేధార్‌, బి.ఎన్‌. శాస్త్రీ తదితరులు పాల్గొన్నారు.