ఆత్మబలిదానాలు రాజకీయ హత్యలే

అంతర్జాతీయ మీడియా ఆందోళన
విద్యాధికులు, మంచి భవిష్యత్‌ ఉన్న వారే త్యాగాలకు సిద్ధపడుతున్నారు
న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడి
హైదరాబాద్‌, మార్చి 30 (జనంసాక్షి) :
దశాబ్దాల తరబడి రాజకీయ పార్టీలు కొనసా గిస్తున్న మోసపూరిత విధానాల వల్లే ఉజ్వల భవిష్యత్‌ ఉన్న యువత తెలంగాణ ప్రాంతంలో ఆత్మ బలిదానాలకు సిద్ధపడుతోందని అంత ర్జాతీయ మీడియా ఆందోళన వ్యక్తం చేసింది. భారత దేశంలో 29వ రాష్ట్రం ఏర్పాటు కోసం గతంలో కనీ వినీ ఎరుగని రీతిలో పోరుసా గిస్తూనే పాలకులపై, ప్రాంత ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెంచేందుకు యువకులు, విద్యాధికులు ఆత్మహత్యలను మార్గంగా ఎంచుకుంటున్నారని ‘న్యూ యార్క్‌ టైమ్స్‌’ వెల్లడించింది. తెలంగాణ ప్రాంతంలో నాలుగు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు ఉద్యమిస్తున్నా పాలకులు వారి డిమాండ్‌ను పక్కన పెట్టి కేవలం ఎన్నికల అంశంగా మార్చేశారు. ఎన్నికలకు ముందు తెలంగాణ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోల్లో ప్రకటించి, పార్టీ అత్యున్నత సమావేశాల్లో తీర్మా నాలు చేసి తర్వాత అంశాన్ని కోల్డ్‌స్టోరేజీ పెట్టేందుకే ప్రయత్నించారు. 2009లో ఉద్యమంలో ఊరూవాడా ఏకమై సాగాయి. విద్యార్థుల నేతృత్వంలో వివిధ సంఘాలు ఉద్యమాన్ని హోరెత్తించాయి. తెలంగాణ ప్రాంతం ఆందోళనలతో మార్మోగింది. తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌ అంటూ కోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రజలు భగ్గుమన్నారు. సర్కారు తీరుతోనే కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చిందని మూకుమ్మడిగా పోరు సాగించారు. దీంతో రాష్ట్ర అసెంబ్లీ హైదరాబాద్‌ ఫ్రీ జోన్‌ కాదని, ఆరో జోన్‌లో భాగమేనని తీర్మానం చేసింది. అప్పటికే తరతరాల దోపిడీ, పీడనలు, వనరులు, నీళ్లు, నిధులు, ఉద్యోగాల అక్రమ తరలింపును నిరసిస్తూ యావత్‌ తెలంగాణ ఒక్కటై దిక్కులు పిక్కటిల్లేలా రణనినాదం చేసింది. దీంతో కేంద్రం దిగివచ్చి 2009 డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. పార్లమెంట్‌ నిండు సభలోనూ ఈ విషయాన్ని ఉద్ఘాటించింది. అదే సమయంలో సీమాంధ్ర పెట్టుబడిదారులు బలవంతంగా స్పాన్సర్డ్‌ ఉద్యమాన్ని ఆ ప్రాంత శక్తుల చేతుల్లో కేంద్రీకృతమై ఉన్న మీడియా పెద్దది చేసి చూపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏదో జరిగిపోతుందంటూ చిలువలు పలువలు చేసి సొంత కథనాలు అల్లుకుపోయింది. అదేసమయంలో యూపీఏలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌ పార్టీలోని కొందరు పెద్దలను మచ్చిక చేసుకున్న పెట్టుబడిదారి శక్తులు ఆంధ్రప్రదేశ్‌ యథా పరిస్థితులు కొనసాగించనున్నట్లు కేంద్రం ప్రభుత్వంతో ప్రకటన చేయించారు. నాలుగు దశాబ్దాల పోరాటం ఫలిస్తుందనుకున్న వేల.. స్వపరిపాలన.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సొంతమవుతాయనుకున్న సమయాన, వనరులు, నీళ్లు, నిధులు తమ ప్రాంతానికే చెందుతాయనుకుంటున్న సందర్భంలో కాంగ్రెస్‌, యూపీఏ మరోసారి వంచనకు గురిచేయడంతో గుండె చెదిరిన తెలంగాణ యువత, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందరో ఉరికొయ్యలపై వేలాడారు, తమను తాము దహించుకొని కాలి బూదవుతూ జై తెలంగాణ అని నినందించారు. ప్రముఖ యూనివర్సిటీలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థి మీగడ సాయికుమార్‌ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే సవేరా బేగమ్‌ అనే విద్యార్థిని తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయమంటూ ఉరివేసుకుంది. కరుణాకర్‌ అనే మరో విద్యార్థి ఇలాగే ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఆయన మరణించేముందుకు రాసుకున్నట్లు చెప్తున్న లేఖనూ ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ తన కథనంలో ప్రచురించింది. ‘తెలంగాణ ప్రజలకు నా చివరి ఉద్యమ వందనాలు. దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం మనం పోరాడుతున్నాం. ప్రజల ఆకాంక్షను ఎలుగెత్తి చాటేందుకే నేను ఆత్మత్యాగానికి సిద్ధపడ్డాను. నా చివరి కోరిక ఒక్కటే నా మృతదేహాన్ని రాష్ట్ర అసెంబ్లీ మీదుగా గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు తీసుకెళ్లండి. ఇక సెలవు.’ అంటూ పేర్కొన్నాడు. ఈ లేఖను చదివితే హృదయం ఉన్న ప్రతిఒక్కరు బాధ పడతారు. కానీ కాంగ్రెస్‌ రాతి గుండెలు కరగలేదు. అలాగే వరంగల్‌కు చెందిన ఎం. సునీల్‌కుమార్‌ ‘నేను తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తున్నాను.. నా మరణం ఈ ప్రాంత నేతల కళ్లు తెరిపించాలి’ అని కోరుతూ ఉరి వేసుకున్నాడు. ఇలా కేవలం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటిచెప్పేందుకు వందలాది మంది ఆత్మబలిదానాలకు పాల్పడటం రాజకీయ ప్రాబలత్యంతో జరుగుతున్న హత్యలుగా అంతర్జాతీయ మీడియా అభివర్ణించింది. దీన్ని ఆపగలిగి ఉండి కూడా కేంద్ర ప్రభుత్వం కావాలని అంశాన్ని సాగదీస్తూ ఆత్మహత్యలను ప్రోత్సహిస్తోందని పేర్కొంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే పరిస్థితి ఎటువైపు వెళ్తోందనని ఆందోళన వ్యక్తం చేసింది.