ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని రక్షించిన లేక్ పోలీసులు

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) :
కరీంనగర్ లోని దిగువ మానేరు జలాశయం (ఎల్ఎండి) లో ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని మంగళవారం లేక్ ఔట్ పోస్ట్ పోలీసులు రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి ప్రాంతానికి చెందిన మహమ్మద్ జాఫర్ (52) ఆత్మహత్య చేసుకునేందుకు డాం నీటిలో దూకాడు. పెట్రోలింగ్ లో ఉన్న సిబ్బంది గమనించి సదరు వ్యక్తిని నీటిలో నుండి బయటకు తీసి రక్షించారు. తల, చేతి భాగాలకు గాయాలు కావడంతో అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సమస్యలు కారణమని విచారణలో తేలిందని లేక్ అవుట్ పోస్ట్ ఆర్ఎస్ఐ ఏ సురేష్ తెలిపారు. ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తిని రక్షించిన లేక్ ఔట్ పోస్ట్ పోలీసులను పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ అభినందించారు.