ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట
ఎవరికివారే యమునాతీరేలా కార్యక్రమాలు
ఆదిలాబాద్,జూలై21(జనం సాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు ముందస్తు ఊపులోముందుకు సాగుతున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. టిక్కెట్ లక్ష్యంగా సొంత గణానా/-ని ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో నియోజకవర్గం వారీగా కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలైంది. మాజీ మంత్రి, సీనియర్ నాయకులు సి.రాంచంద్రారెడ్డి ఒక గ్రూపుగా, టీపీసీసీ కార్యదర్శి, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత మరో గ్రూపుగా, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి భార్గవ్‌దేశ్‌పాండే ఇంకో గ్రూపు కొనసాగిస్తుండడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. బోథ్‌లో సోయం బాపురావు, అనిల్‌జాదవ్‌లు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కలిసి నడిచింది లేదు. మరోవైపు ఆదివాసీ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న సోయం బాపురావు వచ్చే ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తారా.. లేనిపక్షంలో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగుతారా అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఇదే నియోజకవర్గానికి చెందిన నరేష్‌జాదవ్ కిందటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోసారి ఆయన ఎంపీ స్థానానికే పోటీ చేయాలని భావిస్తున్నారు. మాజీ మంత్రి, సీనియర్ నాయకులు రాంచంద్రారెడ్డి వర్గంలో కొనసాగుతున్న ఆయన సీనియర్ నాయకుల అండదండలు ఉంటాయన్న విశ్వాసంతో కదులుతున్నారు. నిర్మల్‌లో డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలనే ఉత్సాహంతో ముందుకు కదులుతున్నారు. ముథోల్ నియోజకవర్గంలో అన్నదమ్ముళ్లు నారాయణరావుపటేల్, రామారావు పటేల్‌ల మధ్య గ్రూపు రాజకీయాలు నెలకొన్నాయి. సీనియర్ నాయకులైన నారాయణరావు పటేల్ మరోసారి ఇక్కడినుంచి బరిలో దిగుతారా, లేనిపక్షంలో మహేశ్వర్‌రెడ్డి వర్గంతో కొనసాగుతున్న రామారావు పటేల్ పైచేయి సాధిస్తారా అనేది రానున్న రోజుల్లో తేటతెల్లం కానుంది. ఖానాపూర్ నియోజకవర్గంలో భరత్ చౌహాన్, హరినాయక్‌ల మధ్య వైరుధ్యం ఉంది. ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు మరోసారి పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. కాగజ్‌నగర్‌లో రావి శ్రీనివాస్, శ్రీనివాస్‌యాదవ్‌లు ఉండగా, మంచిర్యాలలో ప్రేమ్‌సాగర్‌రావు, అరవింద్‌రెడ్డిలు పార్టీలో సీనియర్లుగా ఉన్నారు. చెన్నూర్‌లో బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే సంజీవ్‌రావు, బెల్లంపల్లిలో చిలుమురి శంకర్, దుర్గాభవానిలు నియోజకవర్గంలో పట్టుకు యత్నాలు చేస్తున్నారు.