ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవాలు ప్రారంభం

జనంసాక్షి, కమాన్ పూర్ : వరాలిచ్చే దేవుడు.. పెద్దపల్లి జిల్లాలోని కమాన్పూర్ గ్రామంలో స్వయంభూగా వెలసిన స్వామి శ్రీ ఆదివరాహస్వామి..!. ఆ స్వామి అవతరించిన మాసం ఈ పవిత్ర శ్రావణమాసం. మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించే శ్రీ ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కమాన్పూర్ మండలమే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆదివరాహస్వామిని దర్శించుకున్నారు. ఆదివారం ప్రారంభమైన ఈ ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు ఆదివారం ఉదయం నిత్య పూజలతో పాటు ప్రత్యేకంగా అగ్ని ప్రతిష్ఠ, యాగశాల ప్రవేశం, మూలమంత్ర హవనం, ఆదివరాహ హవనము, భూ వ్యాపారం, కోర్టు సమస్యలు, గ్రహదోష విముక్తి, సంతాన ప్రాప్తికై విశేష హోమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు వరప్రసాద ఆచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల్లో ఆలయ కమిటీ చైర్పర్సన్ ఇనుగంటి ప్రేమలత, కమాన్ పూర్ తాసిల్దార్ మోహన్ రెడ్డి, పాలకవర్గ సభ్యులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.