ఆదివాసుల సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్,జూలై17(జనం సాక్షి): గిరిజనులను ఏబీసీడీలుగా వర్గీకరించాలని, అప్పుడే అసలైన గిరిజనులకు న్యాయం జరుగుతుందని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు డిమాండ్ చేశారు. గిరిజనుల్లోనూ తారతమ్యాలు ఉన్నాయని అన్నారు. పూర్తిగా అడవికే పరిమితమైన గిరిజనులు అనేక విధాలుగా నష్టపోతున్నారని అన్నారు. 1/70 చట్టం అమలు, ఆదివాసీల హక్కుల సాధన కోసం పోరాటం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణకు సూచనలను అందచేయాలని కోరారు. ఇదిలావుంటే ఏజెన్సీలో రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని దీనికి వ్యతిరేకంగా ఆదివాసీల ఆందోళనను గమనించాలని అన్నారు. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు విస్తరించిన గిరిజన ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో 1/70 చట్టం నీరుగారిపోతుందని, ట్రైబల్ అటానమస్ కౌన్సిల్ ఏర్పాటు చేయకుండా గిరిజన ప్రాంతాలను ముక్కలుగా విభజిస్తున్నారని తెలిపారు. ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నప్పటికీ ఆదివాసీ ఎమ్మెల్యేలు మాత్రం మౌనం వహిస్తున్నారని, ఫలితంగా ఆదివాసీల హక్కులపై ఉక్కుపాదం మోపుతున్నారని విమర్శించారు. ఆదివాసీలు హక్కులు, రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలావుంటే గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తానని ఆదిమ గిరిజన సంక్షేమ, సలహా మండలి ఛైర్మన్ కనక లక్కేరావు అన్నారు. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో ఉమ్మడి జిల్లాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు.