ఆదుకుంటారా..ఆగం చేస్తారా..
– ఎన్నాళ్లు ఈ ఆరండ గోస…
– 18 రోజులుగా రిలే నిరాహారదీక్ష చేస్తున్నా అధికారులకు చలనం లేదా…
– గోదావరి వరద బాధితుల ఆవేదన.
– ముంపు బాధితులకు నేనున్నానంటూ అండగా కేబుల్ టీవీ ప్రశాంత నాయుడు.
బూర్గంపహాడ్ సెప్టెంబర్ 04 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలో అకాల వర్షాల వల్ల గోదావరి పరివాహక ప్రాంతం లో నివసిస్తున్న ముంపు ప్రాంత ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని వరద భాదితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు ప్రాంత ప్రజలను సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆదుకుంటారా..ఆగం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. సారపాక మేజరు గ్రామపంచాయతీ పరిధిలోని ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నెం.262, 214-10 కుంటలు ఫారెస్టు ఆక్రమిత మిగులు భూమిని గోదావరి వరద బాధితులకు ఇండ్ల స్థలాలు కోసం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీ సారపాకకు డంపింగ్ యార్డు స్మశాన వాటికకు కేటాయించారని భాదితులు మొర పెడుతున్నారు. గోదావరి వరద వల్ల సర్వం కోల్పోయి రోడ్డున పడి,18 రోజుల నుంచి నిరాహార దీక్ష చేపడుతుంటే ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదని భాదితులు అంటున్నారు. గోదావరి ముంపు ప్రాంత ప్రజలు ఎన్నాళ్లు ఈఆరండ గోస పడాలని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆ 10 కుంటల భూమిని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు సారపాక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని గోదావరి వరద బాధితులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. వరద బాధితులకు ఇండ్ల స్థలాలు కేటాయించకపోతే ఎన్ని రోజులైనా నిరాహార దీక్ష కొనసాగిస్తామని భాదితులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి సారపాక మేజర్ గ్రామపంచాయతీ ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నారు.