ఆధార్ గడువు పెరుగుతుంది ఆందోళన వద్దు
మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (జనంసాక్షి):
ఆందోళన చెందొద్దు.. ఆధార్ ప్రక్రియ పూర్తయ్యాకే నగదు బదిలీ పధకం అమలవుతుందని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆధార్-సబ్సిడీ సిలిండర్ అనుసంధానంపై కేంద్రం విధించిన గడువు మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉందన్నారు. అందుకు సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ తుది గడువు కాదు.. మరో రెండు నెలలు పొడిగించే అవకాశం ఉందని ఇప్పటికే తమకు సమాచారం అందిందన్నారు. అందువల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రస్తుతం ఆధార్ నమోదు ప్రక్రియ 210 కేంద్రాల్లో జరుగుతోందన్నారు. మరో 200 కేంద్రాలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ విషయంపై కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాధ్యూ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఆధార్ నమోదు ప్రక్రియ ముగిశాకే సబ్సిడి సిలిండర్‌కు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. ఈ విషయంపై త్వరలోనే కేంద్ర పెట్రోలియం శాఖ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందన్నారు. కేంద్ర పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ ఆయనతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోనులో మాట్లాడారని, ఆయన ఈ నెల 12వ తేదీన రానున్నారన్నారు. నేడో, రేపో గడువు పొడిగింపుపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందన్నారు. ఆధార్ నమోదు ప్రక్రియ మూడు దశల్లో ఉంటుందన్నారు. దరఖాస్తు నింపి వారికి అందజేశాక తేదీ, సమయంతో కూడిన కూపను ఇస్తారు. ఆ కూపన్ తీసుకుని ఐరీష్ తీసుకోవాలి.. ఆ తర్వాత కొద్ది రోజులకు కార్డు వస్తుందన్నారు. అప్పటివరకు వేచి ఉండాల్సిందేనన్నారు. ఆధార్ ప్రక్రియ విశిష్టమైనదని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ వల్లే కేంద్ర ప్రభుత్వం తొలుత మన రాష్ట్రంలో చేపట్టిందన్నారు. మన రాష్ట్రంలో నమోదు ప్రక్రియ తీరు చూశాక మిగిలిన రాష్ట్రాలు ఆధార్ ప్రక్రియకు తెరదీశాయన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 2011 లెక్కల ప్రకారం.. 50,96,396మంది జనాభా కాగా.. వారిలో 39,73,001మంది ఆధార్‌లో తమ సమాచారాన్ని నమోదు చేయించుకున్నారు. వారిలో 28,59,938 మందికి ఆధార్ కార్డులు అందాయి. మిగిలిన 24,36,458మందికి కార్డులు అందాల్సి ఉందన్నారు. అయితే వారిలో 13,22,000 మంది ఆధార్‌లో తమ పేర్లను నమోదు చేసుకోకుండా ఉన్నారన్నారు. త్వరలో మరో 200 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, అందరికీ అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఎవరూ ఎటువంటి ఆందోళన పెట్టుకోవద్దని కోరుతున్నామన్నారు. ఆధార్ ప్రక్రియ పూర్తయ్యాకే ప్రభుత్వ పథకాలు అమలు అవుతాయని తెలిపారు. అర్హులైన వారికి సబ్సిడీ అందాలన్న లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని చేపట్టిందన్నారు. స్కాలర్‌షిప్‌లు గాని, నగదు బదిలీ పథకం గాని ఆధార్‌తోనే అనుసంధానం చేసిందని వివరించారు. ఆందోళనలు విరమించుకుని ఆధార్‌లో పేరు నమోదు చేసుకోవాలని, అధికారులకు సహకరించాలని ప్రజలను కోరుతున్నామని తెలిపారు.