ఆఫ్ఘన్‌ భారత దౌత్యకార్యాలయంపై ఉగ్రదాడి

3

– నలుగురు మృతి

న్యూఢిల్లీ,మార్చి2(జనంసాక్షి): ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. జలాలాబాద్‌లో ఉన్న భారతీయ దౌత్య కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఓ సుసైడ్‌ బాంబర్‌ అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతం చేశాయి. పేలుళ్లు, కాల్పులతో దద్దరిల్లిన జలాలాబాద్‌లో ఓ సాధారణ పౌరుడు మృతిచెందగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే దౌత్య కార్యాలయంలో ఉన్న భారతీయులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భారతీయ దౌత్య కార్యాలయాన్ని సుసైడ్‌ బాంబర్‌ టార్గెట్‌ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పగటిపూట కౌన్సులేట్‌ ఆవరణలోకి ఓ ఉగ్రవాది గ్రేనేడ్‌ను విసిరినట్లు తెలుస్తోంది.

కాల్పుల శబ్ధాలు మోగడంతో ఆ ప్రాంతాన్ని వెంటనే భద్రతా దళాలు చుట్టుముట్టాయి. సాధారణ పౌరులు అక్కడి నుంచి హుటాహుటిన తరలివెళ్లారు. ఇండో-టిబెట్‌ బోర్డర్‌ పోలీసులు దౌత్య కార్యాలయానికి భద్రత కల్పిస్తున్నారు. దౌత్య కార్యాలయానికి దగ్గర్లో ఉన్న గెస్ట్‌ హౌజ్‌ నుంచి ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఆ కాల్పులను భద్రతా దళాలు తిప్పికొట్టాయి. పేలుడు వల్ల సవిూప భవనం దెబ్బతిన్నది. ఆ బిల్డింగ్‌ కిటికీలు, డోర్లు ధ్వంసం అయ్యాయి. మరో ఎనిమిది కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాడులకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించలేదు.