ఆమోథిలో ఒక్క పోలింగ్‌ బూత్‌లోనూ.. 

విజయం సాధించలేరు
– గెలిస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా
– భాజపాకు సవాల్‌ విసిరిన యూపీ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ దీపక్‌ సింగ్‌
లక్నో, జూన్‌5(జనం సాక్షి ) : ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి దీపక్‌ సింగ్‌ మంగళవారం భాజపాకు సవాలు విసిరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ యూపీలోని అమేథిలో ఒక్క పోలింగ్‌ బూత్‌లో కూడా విజయం సాధించదని.. ఒకవేళ గెలిస్తే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాననని సవాలు చేశారు. ఇటీవల భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టున్న స్థానాల్లో భాజపా గెలుస్తుందని అన్నారు. ఆయన వ్యాఖ్యలను సవాలు చేస్తూ దీపక్‌ సింగ్‌ పై విధంగా స్పందించారు. ఉన్నత స్థాయి నేతలు సహా చాలా మంది భాజపా ఎంపీలు తమ తమ నియోజకవర్గాలను మార్చుకోవాలని అనుకుంటున్నారని దీపక్‌ అన్నారు. భాజపా అబద్ధాలపై త్వరలోనే జాబితా తయారుచేస్తామన్నారు. 2014 ఎన్నికల్లో భాజపా మోదీ ప్రభంజనంపై ఆధారపడిందని, ఇప్పుడు అది కుదరదని పేర్కొన్నారు. అమేథి విజయంపై తాము ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నామని యూపీ మంత్రి సరేశ్‌ పసి కూడా వెల్లడించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథిని ఓటమి నుంచి కాపాడుకోవాలని కాంగ్రెస్‌కు సవాలు చేశారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ లోక్‌సభ నియోజకవర్గమైన రాయ్‌బరేలీలో భాజపా ఓట్ల శాతం 2009లో 4శాతం ఉండగా, 2014లో 21శాతానికి పెరిగిందని తెలిపారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నియోజకవర్గమైన అమేథిలో భాజపా ఓట్ల శాతం 6 నుంచి 34శాతానికి పెరిగిందని చెప్పారు.