ఆయకట్టు అంతటికీ సాగునీరు
వంశధార ఎస్.ఈ. రాంబాబు
శ్రీకాకుళం, జూలై 16 : వంశధార ప్రాజెక్టు పరిధిలో అన్ని కాలువల్లోకి నీటిని విడుదల చేశామని ఆ శాఖ ఎస్.ఈ. బి.రాంబాబు తెలిపారు. నరసన్నపేట మండలంలోని జమ్ము కూడలి వద్ద ఎన్బీసీ కాలువ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రధాన కాలువ ద్వారా టెక్కలి డివిజన్ పరిధిలో జనన్నాథసాగరం వరకు నీటిని మళ్లించామన్నారు. వంశధార కాలువ దిగువన ఉన్న మొత్తం ఆయకట్టునంతటికీ నీటిని అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 13వ ఆర్థిక సంఘం, ప్లాన్ గ్రాంటులతో మంజూరైన పనులు త్వరితగతిన పూర్తి చేశామని అయితే సమయాభావం కారణంగా కొన్ని పనులు పూర్తి చేయలేకపోయామన్నారు. అలాంటి పనులు వచ్చే ఏడాది పూర్తి చేస్తామని ఎస్‌ఈ రాంబాబు తెలిపారు. ఆయనతో పాటు టెక్కలి ఇ.ఇ. వై.ఎస్.సుధాకర్, డి.ఇ.ఇ. బి.శేఖరరావు తదితరులు పాల్గొన్నారు.