ఆరుగురు క్రికెటర్లకు పీసీబీ షార్ట్ కాంట్రక్ట్
: క్రికెటర్ల కాంట్రాక్టుల విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మిగిలిన దేశాల కంటే భిన్నంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆరుగురు క్రికెటర్లకు షార్ట్ కాంట్రాక్టులు ఇస్తున్నట్టు ప్రకటించింది. వీరంతా ఈ ఏడాది మొదట్లో విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కని వారే. పేస్ బౌలర్లు మహ్మద్ తల్హా, మహ్మద్ సమి, తనీష్‌ఖాన్, ఉమైద్ ఆసిఫ్, ఆల్‌రౌండర్ ఫావద్ అలం, లెగ్‌స్పిన్నర్ యాసిర్ షాలకు నాలుగు నెలల స్వల్ప కాంట్రాక్ట్ ఇచ్చినట్టు పిసిబీ తెలిపింది. దీని ప్రకారం వీరికి నెలకు 40 వేల చొప్పున లభిస్తుంది. సెప్టెంబర్ నుండి ఈ ఒప్పందం అమలులో ఉందని వెల్లడించింది. వీరి ఆటతీరును పరిశీలించిన తర్వాత సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. అయితే స్వల్ప కాలపు కాంట్రాక్టులు పొందిన ఈ ఆరుగురు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన వారితో పోలిస్తే తమకు చాలా తక్కువ మొత్తం వస్తోందని వీరు చెబుతున్నారు. పిసిబీ ఈ ఏడాది ప్రకటించిన ఒప్పందాల ప్రకారం కేటగిరీ ఎ ప్లేయర్లు నెలకు 313000, మిగిలిన వారికి కనీసం 75 వేల చొప్పున అందుకుంటున్నారు. ముఖ్యం గా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించి జాతీ య జట్టులోకి తిరిగి వచ్చిన సవిూ, తల్హా బోర్డు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంక టూర్‌కు ఎంపికైనప్పటి నుండీ నిలకడగా రాణిస్తున్నా సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకుండా, తక్కువ మొత్తంలో మ్యాచ్ ఫీజులు కేటాయించ డం సరికాదని సవిూ అంటున్నాడు. ప్రస్తుతం ప్లేయర్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో ఈ వివాదం పిసిబి ఛైర్మన్ జాకా అష్రాఫ్ దృష్టికి వెళ్ళింది. ప్రస్తుతం భారత పర్యటనకు సంబంధించిన పనులతో బిజీగా ఉన్న అష్రాఫ్ త్వరలోనే ఆటగాళ్ళ కాంట్రాక్టులపై జోక్యం చేసుకుంటారని హావిూ ఇచ్చినట్టు తెలుస్తోంది.