ఆరు నూరైనా చలో అసెంబ్లీ

లాఠీ, తూటాలకు భయపడం
కోదండరామ్‌
హైదరాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి) :
ఆరు నూరైనా, ఎన్ని నిర్బంధాలు విధించినా చలో అసెంబ్లీని విజయవంతం చేసి తీరతామని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. లాఠీలకు, తూటాలకు భయపడేది లేదని, ప్రత్యేక రాష్ట్రం కోసం ఆందోళన కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అంతిమ విజయం తెలంగాణదేనని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 14న నిర్వహించనున్న చలో అసెంబ్లీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చలో అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకుంటే గ్రామాల్లోకి వచ్చే పార్టీ నేతలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రతిపక్షం కూడా అధికార పక్షంతో కుమ్మక్కైందని ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్ద ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 14న నిర్వహించనున్న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరతామని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు కలిగించినా తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమం ప్రభుత్వానికి చెంపపెట్టులా ఉండాలన్నారు. చలో అసెంబ్లీ సందర్బంగా ముందుస్తు అరెస్టులు చేస్తే రానున్న స్థానిక ఎన్నికల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులను అడుగుపెట్టనివ్వమని తేల్చి చెప్పారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో ఏం జరిగినా ముఖ్యమంత్రి కిరణ్‌కుమారెడ్డే బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. ‘టోపీ, లాఠీ రెండూ సీఎం చేతిలో ఉన్నాయి. ఏం జరిగినా ఆయనదే బాధ్యత’ అని పేర్కొన్నారు. 10న టీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఐ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నట్లు కోదండరామ్‌ చెప్పారు. చలో అసెంబ్లీ విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై భేటీలో చర్చిస్తామన్నారు. తెలంగాణను వ్యతిరేకించే వారిని జేఏసీ కార్యక్రమాలకు పిలవమని చెప్పారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షం కూడా అధికార పక్షంతో కుమ్మక్కైందని మండిపడ్డారు. తెలంగాణను అడ్డుకొనేందుకు అధికార, ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయని విమర్శించారు. పోలీసులు అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించి తీరతామని చెప్పారు. పద్ధతి ప్రకారం చలో అసెంబ్లీకి ప్రభుత్వ అనుమతి అడిగామని ఇచ్చినా, ఇవ్వకపోయినా ఆందోళన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. చలో అసెంబ్లీకి అందరూ ముందుగా ఇందిరాపార్కుకు రావాలని, అక్కడి నుంచి ఉదయం 11 గంటలకు అసెంబ్లీ వరకు ర్యాలీ ఉంటుందన్నారు. శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న తమను అడ్డుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులను గ్రామాల్లోకి అడుగు పెట్టకుండా అడ్డుకుంటామన్నారు. తెలంగాణ జేఏసీ నేతలు రాజకీయ పార్టీలో చేరితే తప్పేమిటని కోదండరాం ప్రశ్నించారు. జేఏసీ నేతలు స్వామిగౌడ్‌, నర్సయ్య తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరడంపై విలేకరులు ప్రశ్నించగా ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ఎన్నికలు కూడా ఉద్యమ వేదికలేనని, జేఏసీ నేతలు పార్టీల్లో చేరడంలో తప్పేవిూ లేదన్నారు. జేఏసీ నేతలు జగన్‌లా జైలుకెళ్లలేదని పేర్కొన్నారు. జూన్‌ 10న టీఆర్‌ఎస్‌, సీపీఐ, బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తామన్నారు.ఉద్యమకారులను కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల జేఏసీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. కేసులకు భయపడేది లేదని, ఎన్ని నిర్బంధాలనైనా ఎదుర్కొంటామన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకూ ఉద్యమం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజాప్రతినిధులను చూస్తుంటే సిగ్గెస్తోందని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఒత్తిడి తేవాల్సిన నేతలు పదవులను పట్టుకొని వేలాడడం సిగ్గుచేటని విమర్శించారు. వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పార్టీని వదిలి ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు.