ఆరోగ్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా అమితాబ్‌

2

హైదరాబాద్‌,జనవరి6(జనంసాక్షి): పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ హెల్త్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ వ్యవహరిస్తారని మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి అమితాబ్‌ అంగీకరించారని కామినేని తెలిపారు. వైద్య రంగాన్ని మెరుగుపరచేందుకు నిపుణుల సూచనలు తీసుకున్నామని, రెండు నెలలకోసారి నిపుణుల కమిటీ భేటీ అవుతుందని ఆయన తెలిపారు. విమ్స్‌ అభివృద్ధికి నిధులు కేటాయించామని తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుచేస్తామన్నారు. ఇదిలావుంటే స్మార్ట్‌ విలేజ్‌ పథకాన్ని ఈనెల 18న అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.  సచివాలయంలో మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనిపై అధికారులతో చర్చించామని అన్నారు. స్మార్ట్‌ విటేజ్‌, స్మార్ట్‌ వార్డు అనే కొత్త కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమం జనవరి 1న విజయవాడలో ప్రకటించినట్లు చంద్రబాబు నాయుడు చెప్పారు. ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ వెళతామని. స్మార్ట్‌ విటేజ్‌, స్మార్ట్‌ వార్డుపై ఒక పుస్తకం కూడా రూపొందించామని, ఆ పుస్తకంలో అన్నీ వివరించామని ఆయన తెలిపారు. దీన్ని ప్రతి ఒక్కరూ చదివి… ఇంకా బాగా అభివృద్ధి చేయడం కోసం మెరుగైన సూచనలు ఇవ్వాలని, వాటిని పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. ఆంధప్రదేశ్‌ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.ఎప్పుడు కరెంట్‌ వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో ఉన్న రాష్ట్రంలో నిరంత విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని చెప్పారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ కింద ఫేజ్‌ 1 అమలు చేశామని ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద రూ. 2.50 లక్షలకు పెంచి మెరుగైన వైద్యం కోసం ముందుకు వెళుతున్నామని బాబు తెలిపారు.  నెల 13న అధికారికంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభం అవుతాయని.. మహిళలకు ముగ్గుల పోటీలు, వంటల పోటీలు జరుగుతాయని, రైతులకు పంటలు, పశువుల ప్రదర్శనలు ఉంటాయని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ నెల 12వ తేదీ లోపల సంక్రాంతి సరుకులు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. ఎన్టీఆర్‌ వైద్య సేవకు విస్తృత ప్రచారం కల్పించాలని నేతలు, అభిమానులు, కార్యకర్తలకు ఆయన సూచించారు. పని విషయంలో అధికారులు శ్రద్ధ చూపించాలని చంద్రబాబు పేర్కొన్నారు. అధికారుల్లో జవాబుదారీతనం తీసుకురావడానికి వీడియో కాన్ఫరెన్స్‌ ఉపయోగపడుతుందని ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సచివాలయంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు సవిూక్షలు చేసుకుంటూ వెళ్లాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని పనులు పూర్తిచేయాలని చంద్రబాబు సూచించారు.