ఆర్టీసీ దిష్టిబొమ్మ దగ్ధం : ఎన్‌ఎస్‌ఎఫ్‌

నిజామాబాద్‌, జూలై 20 : విద్యార్థులకు బస్‌ సౌకర్యం కల్పించడంలో ఆర్టీసి విఫలమైందని దీనిని నిరసిస్తూ నవ సమాజ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బస్టాండ్‌ ముందు ఆర్టీసి దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్బంగా ఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ప్రతాప్‌ మాట్లాడుతూ, దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించడంలో ఆర్టీసి విఫలమైందన్నారు. ఒక బస్సులో పరిమితి కన్నా ఎక్కువ మంది విద్యార్థులు ఎక్కి వెళుతున్నా ఆర్టీసి పద్దతి వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. ఇంతకు ముందు ఆర్‌ఎంకు సమస్యలు విన్నవించినా పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ఇదిలా ఉండగా నిజామాబాద్‌లో బస్‌ పాస్‌లు తీసుకున్నవారు నిజామాబాద్‌ డిపో బస్‌లు మాత్రమే ఎక్కాలని ఆర్మూర్‌ బస్సులలో ఎక్కకూడదని ఆర్మూర్‌ డిపో మేనేజర్‌ చెప్పడం సమంజసం కాదని అన్నారు. దూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సృజన్‌, ఉపాధ్యక్షులు ఆదిత్య, నవీన్‌, సాయి, నరేష్‌, శంకర్‌, అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.