ఆర్బీఐ గుడ్ న్యూస్..

ముంబయి: విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్ల ను ఆర్‌బీఐ మళ్లీ సవరించింది. వరుసగా రెండోసారి రెపో రేటును  0.25 శాతం మేర తగ్గించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్‌బీఐ  గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా బుధవారం వెల్లడించారు. దీంతో రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి దిగొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ కీలక వడ్డీరేట్లను కేంద్ర బ్యాంకు 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే.

తగ్గింపు నిర్ణయానికి ‘మానిటరీ పాలసీ కమిటీ  ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు ఆర్‌బీఐ గవర్నర్ వెల్లడించారు. ఈ సందర్భంగా స్థిర విధానం నుంచి సర్దుబాటు వైఖరికి మరాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. వడ్డీరేటు తగ్గింపుతో గృహ, వాహన, ఇతర రుణాల వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉంది.

గవర్నర్‌ ప్రసంగంలోని కీలకాంశాలు..

  • ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు పెట్టుబడులు, వినిమయంపై ప్రతికూల ప్రభావం చూపించనున్నాయి. ఫలితంగా వృద్ధి రేటు నెమ్మదించొచ్చు.
  • అధిక సుంకాలతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. తయారీ రంగం పునరుద్ధరిస్తున్న సంకేతాలు కన్పిస్తున్నాయి.
  • 2025-26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5శాతంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. తొలి త్రైమాసికంలో 6.5శాతం, రెండో త్రైమాసికంలో 6.7శాతం జీడీపీ నమోదవ్వొచ్చని అంచనా. మూడు, నాలుగు త్రైమాసికాల్లో వృద్ధి రేటు వరుసగా 6.6శాతం, 6.3శాతం ఉండొచ్చు.
  • ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పడుతుండటంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4శాతానికి దిగి రావొచ్చని అంచనా. త్రైమాసికాల వారీగా 3.6శాతం, 3.9శాతం, 3.8శాతం, 4.4శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
  • ఏప్రిల్‌ 4వ తేదీ నాటికి విదేశీ నిల్వలు 676 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. వీటితో రాబోయే 11 నెలల వరకు దిగుమతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.