ఆర్యవైశ్య భవన్ కు జిల్లా కేంద్రంలో స్థలం కేటాయిస్తా
– మంత్రి జగదీష్ రెడ్డి హామీ
ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తాం
రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని పిలుపు
ఘనంగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య భవన్ కు స్థలం కేటాయిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి హామీ ఇచ్చారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని రవి మహాల్ ఏసి కన్వెన్షన్ హాలులో జరిగిన జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ , ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఆ సంఘ సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా మాశెట్టి అనంతరాములుతో పాటు నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య భవన్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలిస్తే, ఆ స్థలానికి ఒక్కరోజులో ఆమోదింపజేస్తానని మంత్రి నూతన కార్యవర్గానికి హామీ ఇచ్చారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆర్యవైశ్యులు రాజకీయంగా అత్యంత చైతన్యవంతంగా ఉన్నారని, ప్రజాసేవలో ముందుంటున్నారని, అందుకు తగ్గట్టుగా భవిష్యత్తులో ఆర్యవైశ్యులకు రాజకీయ అవకాశాలు లభిస్తాయని అన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాలుగు మున్సిపల్ చైర్మన్లు , ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి, అలాగే రాష్ట్రస్థాయిలో నాలుగు కార్పొరేషన్ చైర్మన్లు, ఒక ఎమ్మెల్సీ పదవి కూడా వైశ్యులకే దక్కిందన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైశ్యులకు టిఆర్ఎస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.పలు సందర్భాల్లో ఆర్యవైశ్యులు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందు ఉన్నారని, అదేవిధంగా నాయకులుగా ఎదగాలని ఆయన సూచించారు.భవిష్యత్తులో ఆర్యవైశ్యులకు ఏ అవసరం వచ్చినా తనతో పాటు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. 2014 ముందు నాటికి, నేటికి పరిస్థితుల్లో మార్పు స్పష్టంగా కనబడుతుందన్నారు.తెలంగాణ రాష్ట్ర సగటు ఆదాయంతో పాటు తలసరి ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు.కరోనా కష్టకాలంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా నిలదొక్కుకుని ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించిందని గుర్తు చేశారు.కొత్త పంటల దిగుబడికి అనుగుణంగా నూతన పరిశ్రమలను నెలకొల్పే విధంగా ఆలోచన చేసి ఆర్యవైశ్యులు ముందుకు సాగాలని ఆకాంక్షించారు.అంతకు ముందు రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సంగ్రామంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్యవైశ్యుల పాత్ర ప్రశంసనీయమని కొనియాడారు.దేశస్థాయిలో ఆర్యవైశ్యులకు ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య ఆర్యవైశ్యులకు గుర్తింపు తెచ్చినట్లుగానే ఆర్యవైశ్యులు ముందుకు సాగాలని సూచించారు.తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గతంలో కంటే ఎక్కువగా సభ్యత్వాలు చేర్పించాలని తద్వారా సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.పనిచేసే వారికి సంఘంలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు.ఆర్యవైశ్యులు అందరూ కలిసికట్టుగా ఉండి సాధించుకోవచ్చని సూచించారు.జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మాశెట్టి అనంత రాములు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో తమ సంఘ భవనానికి స్థలాన్ని కేటాయించిన మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.నూతన అధ్యక్షునిగా తాను ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించిన ఆర్యవైశ్య సంఘం నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.జిల్లాలో సంఘ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్,మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలిత ఆనంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నాయకులు,ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు రాజా, కోశాధికారి తెల్లాకుల వెంకటేశ్వర్లు, పొలిటికల్ చైర్మన్ తాటికొండ సీతయ్య, యువజన విభాగం అధ్యక్షులు మీలా వంశీ, ప్రధాన కార్యదర్శి జగిని ప్రసాద్, కోశాధికారి కొత్తూరు గణేష్, మహిళా విభాగం అధ్యక్షురాలు గుండా శ్రీదేవి, ప్రధాన కార్యదర్శి మీలా వీరమణి, కోశాధికారి సోమా పద్మ , పట్టణ అధ్యక్షులు మంచాల రంగయ్య, ప్రధాన కార్యదర్శి కలకోట లక్ష్మయ్య, కోశాధికారి దేవరశెట్టి సత్యనారాయణ, కలకోట అనిత, బిక్కుమల్ల జ్యోతి, చల్లా శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.