ఆర్‌ఎస్‌ఎస్‌ విూటింగ్‌కు ప్రణబ్‌ హాజరుపై తొలగని విభేదాలు

ప్రణబ్‌ హాజరును తప్పపట్టరాదు: షిండే

మంచిది కాదేమో అన్న వీరప్పమొయిలీ

ముంబై,జూన్‌4(జ‌నం సాక్షి ): మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానాన్ని అంగీకరించడంపై కాంగ్రెస్‌లో విభేదాలు కొనసాగుతున్నాయి. పరస్పర విరుద్ద అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హ ఆజరు కావడంలో తప్పు లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే తెలిపారు. ప్రణబ్‌ ఆ విూటింగ్‌కు వెళ్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ప్రణబ్‌ లౌకికవాది, మంచి ఆలోచనపరుడన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వేదికపై ప్రణబ్‌ మాట్లాడటం ముఖ్యమైన అంశంగా తీసుకోవాలన్నారు. ప్రణబ్‌ ఆ వేదికపై పంచుకునే ఆలోచనలు బీజేపీలో గానీ లేదా ఆర్‌ఎస్‌ఎస్‌లో కొంత అభివృద్ధిని తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నెల 7న నాగ్‌పూర్‌లో జరిగే ఆరెస్సెస్‌ తృతీయ వర్ష శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరుకావొద్దని ఎన్ని సూచనలు చేస్తున్నా మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మాత్రం వాటిని బేఖాతరు చేశారు. తాను ఏం చెప్పదల్చుకున్నానో అవన్నీ నాగ్‌పూర్‌లోనే మాట్లాడుతానని ప్రణబ్‌ తేల్చి చెప్పారు. ఆరెస్సెస్‌ కార్యక్రమానికి వెళ్లొద్దని తనకు చాలా లేఖలు, ఫోన్లు వచ్చాయని.. అందులో ఏ ఒక్కదానికి స్పందించలేదని ప్రణబ్‌ముఖర్జీ చెప్పినట్టు బెంగాలీ పత్రిక ఆనందబజార్‌ వెల్లడించింది. అయితేనాగ్‌పూర్‌లో జూన్‌ 7న ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్వహించే కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సంసిద్ధత పట్ల కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వీరప్పమొయిలీ స్పందిస్తూ దేశంలో అనుకోని వ్యత్యాసాలకు తావిచినట్లు అవుతోందని సోమవారం విమర్శలు చేశారు. ఈ సమావేశం సందర్భంగా చాలా విభేదాలు రానున్నాయని, అవి దేశానికి అవసరం లేదని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానాన్ని ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదించిన అనంతరం పలు విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆయన నిర్ణయాన్ని ఒకసారి పునరాలోచన చేసుకోవాలని పలువురు కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.