ఆర్‌బీఐ గవర్నర్‌పై వ్యక్తిగత విమర్శలొద్దు

2

– అరుణ్‌ జైట్లీ

న్యూఢిల్లీ,మే26(జనంసాక్షి): రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురాం రాజన్‌పై విమర్శలను తాను అంగీకరించబోనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి డిమాండ్ల నేపథ్యంలో ఓ వార్తా ఛానల్‌తో గురువారం జైట్లీ మాట్లాడుతూ ఎవరిపైన అయినా వ్యక్తిగత వ్యాఖ్యలను తాను ఆమోదించనన్నారు. ఆర్‌బిఐ చాలా ముఖ్యమైన వ్యవస్థ అని, అది తన నిర్ణయం తాను తీసుకుంటుందని చెప్పారు. ఆ నిర్ణయంతో కొందరు ఏకీభవించవచ్చునని, లేదంటే విభేదించవచ్చునని పేర్కొన్నారు. అదంతా అంశాలపై చర్చ అన్నారు. ఆర్బీఐ గవర్నర్‌ బహిరంగంగా మాట్లాడకూడదా అన్న ప్రశ్నకు జైట్లీ స్పందిస్తూ తాను ఎవరికీ బయటికెళ్ళొద్దని, ఫలానా విషయం మాట్లాడొద్దని చెప్పలేనన్నారు. అయితే వ్యక్తిగత విమర్శలను అంగీకరించలేనని అన్నారు. ఓ రకంగా ఆయన వ్యాఖ్యలు సుబ్రమణ్యస్వామికి చెక్‌ పెట్టేలా ఉన్నాయి.