ఆవిర్భావ వేడుకలకు అంతా సిద్దం

ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తున్న కలెక్టర్లు
ఆదిలాబాద్‌,మే29(జ‌నం సాక్షి): ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల,నిర్మల్‌  జిల్లాలుగా ఏర్పడిన తరవాత నిర్వహిస్తున్న మలి వేడుకాలు కావడంతో వివిధ కార్యక్రామలు  నిర్వహించేందుకు అధికారులు సమష్టిగా కృషి చేస్తున్నారు.  జూన్‌ 2న నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు ఇప్పటికే ఆదేవించారు. జిల్లాల పునర్విభజన తర్వాత మలిసారిగా నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని వైభవంగా జరపాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టిపెట్టింది. మూడు రోజుల పాటు జరిపే వేడుకల కోసం  ఇప్పటినుంచే శాఖలవారీగా బాధ్యతలు అప్పగించారు. కొత్త జిల్లాల్లో అవతరణ దినోత్సవం నిర్వహించనున్న క్రమంలో ఇటు పతాకా విష్కరణతో పాటు అమరవీరుల కుటుంబాలకు సన్మానం, సాంస్కృతిక ప్రదర్శనలు, సత్కారాలు, వంటకాల నిర్వహణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం పరేడ్‌ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు  అతిథులుగా  పాల్గొంటారు. మొదటగా జూన్‌ 2వ తేదీన ఉదయం 7.30కి అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఉదయం 8.30కి పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభిస్తారు. అదేరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లాలో విభిన్న రంగాల్లో కృషి చేసి అద్భుత ప్రతిభ కనబర్చిన ప్రముఖులను ప్రశంసా పత్రాలు, ఆర్థిక అవార్డులతో సత్కరిస్తారు. జిల్లాలోని ఉత్తమ వేద పండితుడు, సామాజిక సేవా కార్యకర్త, సాహితివేత్త, కళాకారుడు, అంగన్‌వాడీ కార్యకర్త, క్రీడాకారుడు, ఉపాధ్యాయుడిని గుర్తించి సన్మానిం చేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. జిల్లాలోని ఉత్తమ మండల పరిషత్‌, ఉత్తమ గ్రామ పంచాయతీ లేదా ఉత్తమ పురపాలక సంఘాన్ని ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వారందరికీ ప్రశంసాపత్రంతో పాటు ఆర్థిక అవార్డు కూడా అందచేస్తారు. ఈ మేరకు దీనికి సం బంధించి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్లు ఇప్పటికే కోరారు.  అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుని వారి కుటుంబసభ్యులను సన్మానించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యుద్దీపాల అలంకరణ, బాణాసంచా, తెలంగాణ వంటకాలు, సన్మానాల కోసం నిధులు  వినియోగిస్తారు. మరోవైపు వివిధ శాఖలకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ముందుకు సాగుతున్నారు. ఆయా శాఖల వారీగా సన్నద్ధం చేస్తున్నారు. మొత్తంగా మూడు జిల్లాల్లో పండగ వాతావరణంలో కార్యక్రమాలు జరునున్నాయి.

తాజావార్తలు