ఆశలు నింపుతున్న తుంగభద్ర
చిత్తూరు,జూలై10(జనం సాక్షి): తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ ఆశలు రేపుతోంది. గత వారంపది రోజుల్లో వరద వచ్చి చేరడంతో జలాశయం కళకళలాడుతోంది. 10రోజుల కిందట వరకు వ్యతిరేక దిశలో ఉన్న తుంగభద్రను గత నెల 30నుంచి వచ్చిన వరద ఆదుకుంది. అప్పటి నుంచి ఓ మోస్తరు వరద వచ్చిచేరుతూనే ఉంది. కాని 15 వేల క్యూసెక్కులను మించలేదు. స్థానికంగా కురిసిన వర్షాలతో జూన్ 10నుంచే జలాశయానికి వరద రాక ప్రారంభమైంది. జలాశయం ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడి, శివమొగ్గ జిల్లా గాజనూరు వద్ద ఉన్న తుంగా జలాశయం పూర్తిగా నిండి, దిగువకు నీటిని విడుదల చేయడంతో జూన్ 30 నుంచి వరద రాక పుంజుకుంది. అనంతరం వరద ప్రయాణంలో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదకు స్థానిక వర్షాలు తోడైనప్పుడు కొద్దిగా పెరుగుతోంది. గత ఐదు రోజులుగా రోజు విడిచి రోజు హళసపేటె చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో వరద వచ్చి చేరుతుండేది. ఇదిలావుంటే ప్రభుత్వం ఖరారు చేసిన గడువు ప్రకారం..ఆగస్టు 15లోగా హంద్రీ-నీవా జలాలను చిత్తూరు జిల్లాకు తరలించాలని డీసీసీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆందోళన చేస్తామని అన్నారు. హంద్రీ-నీవా జలాలను జిల్లాకు తరలించే విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే మూడుసార్లు గడువు విధించారని, అయితే పనులను పూర్తి చేయలేక మాట తప్పారని ఆరోపించారు.గత మూడేళ్లకాలంలో తెదేపా నాయకులు ప్రజాధనాన్ని దోచుకోవడం తప్ప సాధించిన ప్రగతి ఏవిూ లేదని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో తెదేపా, వైకాపా అధికారంలోకి రావడం అసాధ్యమని, కాంగ్రెస్ వైపు ప్రజల గాలి మళ్లిందని పేర్కొన్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు వల్ల జిల్లాకు నీళ్లు రాకపోగా.. తెదేపా నాయకులకు భారీగా కవిూషన్లు అందుతున్నాయని ఆరోపించారు.