ఆశాజనకంగా లేని వర్షాలు
ప్రాజెక్టుల్లోకి చేరని నీరు
ఆదిలాబాద్,జూన్29(జనం సాక్షి ): ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురవడంతో గోదావరి తీరంలో కొంతమేర వరదలు రావడం కారణంగా ఇటీవల గోదావరిలో నీరు చేరింది. అయితే అనుకున్నంతగా వర్షాలు లేకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. రుపవనాలు ప్రవేశించి నెలరోజులు కావస్తున్నా పెద్దగా వర్షాలు పడకపోగా ఎండాకాలం కొనసాగుతోంది. దీంతో గోదావరికి నీరు వస్తుందా రాదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గత సంవత్సరం ఇదే సమయానికి ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల రైతులు ఆరుతడి పంటలు వేసుకున్నారు. ఈ సంవత్సరం వర్షాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. జూన్ నుంచి అడపాదడపా వర్షం కురుస్తున్నా ఆశించినంత భారీ వర్షాలు మాత్రం కురవడం లేదు. అయితే ప్రస్తుత నీటిమట్టంతో నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు నీరందుతుందా అన్న ఆందోళన నెలకొంది. ఇక కడెం జలాశయంలో నీటిమట్టం ఆశాజనకంగా లేదు. పూర్తిస్థాయికి నీరు చేరలేదు. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 700అడుగులు. ఇప్పుడే నీటిని విడుదల చేస్తే తర్వాత నీటిమట్టం పెరుగకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు, రైతు నాయకులు అభిప్రాయపడ్డారు. పెరిగిన తర్వాతనే ఖరీఫ్ పంటకోసం నీటివిడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. జలాశయంలో ప్రస్తుతం ఉన్న నీటిమట్టం, వస్తున్న ఇన్‌ఫ్లో, ఆయకట్టు తాజా పరిస్థితిపై అధికారులు సవిూక్షిస్తున్నారు. నీటిమట్టం ఇంకా పూర్తిస్థాయికి దగ్గరగా చేరుకోనందున ఖరీఫ్‌నకు విడుదల చేసే విషయమై ఇపుడే నిర్ణయం తీసుకోవద్దని ఆయకట్టు రైతులు అభిప్రాయపడ్డారు. రైతులు ఇంకా దుక్కిదున్ని పొలాలను సిద్ధం చేసుకునే పనుల్లోనే ఉన్నారని, ఇంకా ఎవరూ నార్లు పోసుకునేందుకు సిద్ధంగా లేరని అన్నారు. ఉన్ననీటిని బయటకు వదిలితే అవసరానికి లేకుండా పోతుందని చర్చించారు. అందుకే నీటిమట్టం కనీసం 695అడుగులు దాటితేనే కాల్వలకు నీటిని విడుదల చేయాలని తీర్మానించారు. వర్షాలు ఆశాజనకంగా పడితే రెండుమూడు రోజుల్లోను 695అడుగులకు చేరుకోవచ్చు.
—————–