ఆసరా పెన్షన్ల వయసు తగ్గింపు
65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ఉత్తర్వులు
అధికారులతో సవిూక్షించిన మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్,ఆగస్ట్9(జనంసాక్షి): ఆసరా పింఛన్లు పొందటానికి కనీస వయస్సు 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంకేసీఆర్ ఆదేశాల మేరకు అర్హత ఉన్న లబ్దిదారుల జాబితా వెంటనే తయారుచేసి పెన్షన్లు మంజూరు చేసి, లబ్దిదారులకు అందించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం ఆసరా పెన్షన్లు వయోపరిమితి తగ్గింపు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల పై సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రి సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రావిూణ అభివృద్ధి శాఖ ద్వారా అమలు అవుతున్న వివిధ పథకాలను మంత్రి సవిూక్షించారు. రాష్ట్రంలో అర్హులైన, దారిద్య రేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు పెన్షన్లు అందించాలనే సంకల్పంతో సీఎం పెన్షన్లు పొందడానికి కనీస వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి మూడు రోజుల లోగా పెన్షన్లు మంజూరు చేయాలని ఆయన అధికారులను అదేశించారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు. ఇక పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధి శాఖలో ఉన్న ఉద్యోగులు, అధికారులకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని మంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న అధికారులు ఉద్యోగుల ఖాళీల భర్తీ పక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా హరితహారం పథకం కింద నాటిన మొక్కలను 100 శాతం బతికే విధంగా ప్రత్యేక చర్యలను చేపట్టాలని మంత్రి అధికారులను అదేశించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ పథకం కింద చేపట్టిన పనులను ఎప్పటికప్పుడు సోషల్ ఆడిటింగ్ చేసి నిధులు సద్వినియోగం అయ్యేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. సోషల్ ఆడిట్ పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని, అంతేకాకుండా విలేజ్ రిసోర్స్ పర్సన్స్ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆయన ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో ఇంజినీరింగ్ అధికారుల సీనియారిటీ, ఇతర సమస్యలను పరిష్కరించి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని
మంత్రి దయాకర్ రావు అదేశించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి శాశ్వత పరిష్కారం కోసం నివేదిక సమర్పించాలని ఆయన కోరారు. సమావేశంలో పంచాయితీరాజ్, గ్రావిూణాభివృద్ధి గ్రావిూణ నీటి సరఫరా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సోషల్ ఆడిట్ డైరెక్టర్ సౌమ్య, శాసన మండలి సభ్యుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.