ఆసుపత్రిపై దాడి
కడప, జూన్ 27 : పట్టణంలోని చిల్డ్రన్స్ నర్సింగ్‌హోం సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఓ చిన్నారి మృతి చెందిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఆసుపత్రిపై దాడి చేశారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని ఒక ఆసుపత్రిలో బుధవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. రామాపురం మండలం గువ్వలచెర్వు గ్రామానికి చెందిన విశాల్ అనే వ్యక్తి తన కుమారుడు మన్సూర్ (10నెలలు)కు విరేచనాలు కావడంతో మంగళవారం రాత్రి ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి సిబ్బంది ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తీసుకెళ్లాలని సూచించారు. తిరుపతికి వెళుతుండగా మార్గ మధ్యంలో రాజంపేట వద్ద మన్సూర్ మృతి చెందాడు. దీంతో మన్సూర్ బంధువులు పట్టణంలోని ఆసుపత్రికి చేరుకుని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఒక వైద్యునిపై దాడికి కూడా యత్నించారు. పెద్దమనుషుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.