ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌కు శ్రీకాంత్
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ జోరు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 25-23, 21-17 తేడాతో భారత్ కే చెందిన సాయి ప్రణీత్ పై గెలుపొందాడు. ఇరువురి మధ్య 45 నిమిషాల పాటు జరిగిన పోరులో శ్రీకాంత్ వరుస రెండు సెట్లు గెలిచి సెమీస్ కు చేరాడు. తొలి గేమ్ లో సాయి ప్రణీత్ నుంచి శ్రీకాంత్ కు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.
వీరిద్దరూ హోరాహోరీగా తలపడిన మొదటి గేమ్ లో చివరకు శ్రీకాంత్ పైచేయి సాధించాడు. అదే ఊపును రెండో గేమ్ లో కొనసాగించిన శ్రీకాంత్.. సాయి ప్రణీత్ కు చెక్ పెట్టాడు. తద్వారా సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో సాయి ప్రణీత్ చేతిలో ఎదురైన ఓటమికి శ్రీకాంత్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆ టైటిల్ పోరులో శ్రీకాంత్ పై సాయి ప్రణీత్ గెలిచి టైటిల్ ను కైవసం చేసకున్న సంగతి తెలిసిందే.