ఆ యువతి ఐఎస్‌ఐఎస్‌లో చేరలేదు
నగర పోలీసు కమిషనర్
హైదరాబాద్,జనవరి31(జనంసాక్షి): హైదరాబాద్ నుండి మరో యువతి ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరినట్టుగా వచ్చిన వదంతులను నగర పోలీసు కమిషనర్ మహెందర్‌రెడ్డి ఖండించారు. ఈ మేరకు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్లు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ యువతి టర్కీ వెళ్లిన మాట వాస్తవమే అయినా ఎలాంటి శిక్షణ తీసుకోలేదని, ఈ అంశానికి సంబంధించి ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని నగర పోలీసు కమిషనర్ స్పష్టంచేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి కుటుంబం పదేళ్ల క్రితం దోహాలో స్థిరపడ్డారు. ఇక్కడే ఆ యువతికి ఉగ్రవాద సంస్థతో పరిచయమైంది. జిహాద్ శిక్షణ పొంది యుద్దం చేయాలనే ఉద్దేశంతో ఐఎస్‌ఐఎస్ లో చేరేందుకు ఆ యువతి హైదరాబాద్ నుంచి దోహా విూదుగా ఇరాక్‌కు వెళ్లినట్లు వార్తలొచ్చాయి. ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన ఓ మహిళ…ఆమెను ఐఎస్‌ఐఎస్లో చేరేలా ప్రేరేపించినట్లు,పుకార్లు వచ్చినా పోలీసు కమిషనర్ వాటిని ఖండించారు. అయితే మరోవైపు ఒక్క హైదరాబాద్ నుండే రెండు మూడు నెలల కాలంలో దాదాపు 42 మంది యువకులు వివిధ మార్గాల్లో వెళుతూ సరిహద్దుల్లో భద్రతా దళాలలకు పట్టుబడిన విషయం తెలిసిందే. వీరే కాకుండా హైదరాబాద్‌కు చెందిన వైద్య విద్యార్థిని కూడా ఐఎస్‌ఐఎస్ సంస్థలో చేరేందుకు సిద్ధమై, ఇరాక్, సిరియాకు వెళ్లి పోరాటం చేసేందుకు సిద్ధపడినట్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించిన విషయం తెలిసిందే. ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు వెళుతూ ఇప్పటికే సల్మాన్ మొయిద్దీన్ పట్టుబడి పోలీసుల కస్టడీలో ఉన్నాడు. మొత్తానికి ఇప్పుడు ఎంతమంది ఇందులో ఆకర్షితులయ్యారనేది కూపీ లాగే పనిలో పోలీసులు పడ్డారు.