ఆ రైళ్లు ఇకపై సికింద్రాబాద్ రావు.. ఇతర స్టేషన్లకు మళ్లింపు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా.. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన స్టేషన్ అయిన సికింద్రాబాద్ స్టేషన్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే బోర్డు కీలక ప్రకటన చేసింది. నిత్యం సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చే దాదాపు 10 రైళ్ల గమ్యస్థానాలను తాత్కాలికంగా మార్చుతున్నట్లు పేర్కొంది.కాచిగూడ, ఉమ్దానగర్, మల్కాజ్ గిరి, హైదరాబాద్ (నాంపల్లి) స్టేషన్లకు రైళ్లు మళ్లించినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రయాణికులు తమ రైలు సమయాన్ని ధృవీకరించుకోవాలని ఓ ప్రకటనలో పేర్కొంది. అభివృద్ధి పనుల కారణంగా ఈ మార్పులు చేసినట్లు తెలిపింది.విజయవాడ-సికింద్రాబాద్ (12713/12714) – శాతవా హన ఎక్స్ ప్రెస్ విజయవాడలో బయల్దేరి కాచిగూడ స్టేషన్‌కు చేరుతుంది. అక్కడి నుంచి తిరిగి విజయవాడ బయల్దేరుతుంది. ఉదయం 6.25కు విజయవాడలో బయల్దేరి 12.55కు కాచిగూడ చేరుతుంది. కాచిగూడలో సాయంత్రం 4 గంటలకు బయల్దేరి రాత్రి 10.15కు విజయవాడ చేరుతుంది.సికింద్రాబాద్- రేపల్లె (17645/17646) సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, సిల్చార్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (12514/12513), సికింద్రాబాద్- దర్బంగా (17007/17008) సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ చర్లపల్లి నుంచి బయల్దేరుతాయి.సిద్దిపేట- సికింద్రాబాద్ – (77656/77653), (77654/77655) డెమూ రైళ్లు మల్కాజిగిరి వరకు వెళ్తాయి.
సికింద్రాబాద్- మణుగూరు (12745/12746) సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. తిరిగి చర్లపల్లి చేరుతుంది.
పుణే-సికింద్రాబాద్ (12025/12026) పుణే ఎక్స్ ప్రెస్ బోర్డింగ్ , తిరుగు ప్రయాణం గమ్యస్థానం హైదరాబాద్ స్టేషన్‌కు మార్చారు. తిరుగు ప్రయాణంలో గమ్యస్థానం హైదరాబాద్ వరకు ఉంటుంది.
పోరుబందర్-సికింద్రాబాద్ (20968/20967) పోరు బందర్ ఎక్స్‌ప్రెస్ పోరుబందర్ నుంచి కాచిగూడ మీదుగా ఉమ్దానగర్ వరకు వెళుతుంది.
సికింద్రాబాద్- యశ్వంత్‌పుర (12735/12736) సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ చర్లపల్లి టెర్మినల్ నుంచి బయల్దేరుతుంది. సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా యశ్వంత్‌పుర వెళుతుంది.
ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక ప్రకటన చేశారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో పనులు పూర్తయిన వెంటనే రైళ్ల రాకపోకల్ని పునరిద్ధరిస్తామని తెలిపారు.