ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

– జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): జిల్లాలో ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఇంటర్మీడియట్, అనుబంధ శాఖల అధికారులతో ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సూర్యాపేటలో 7 , కోదాడలో 4, హుజూర్ నగర్ లో 1, నెరేడుచర్లలో 1, మఠంపల్లిలో 1, నడిగూడెంలో 1, తుంగతుర్తిలో 2, నెమ్మికల్ లో 1, తిరుమలగిరిలో ఒక కేంద్రం,  మొత్తం 20 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనైనదని తెలిపారు.ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 26 నుండి 30 వరకు ఉదయం 9.00 గంటల నుండి 12 వరకు, మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.థియరీ పరీక్షలు ఆగస్టు 1 నుండి 10 వరకు ఉదయం 9 నుండి 12 వరకు,మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు జరుగునని పేర్కొన్నారు.జిల్లాలో 8052 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని, పరీక్షల నిర్వహణ సందర్బంగా ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా విద్యుత్, త్రాగు నీరు ఏర్పాటు చేయాలని , పరీక్షల దృష్ట్యా ముందస్తుగా తనిఖీలు చేసి అన్ని మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో ఆర్డిఓ రాజేంద్రకుమార్, డిఐఈఓ  ఆర్.రవి, వైద్య, విద్య, మున్సిపల్,ఆర్టిసి, పిఆర్, పోస్టల్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.