ఇంటింటి ప్రచారంలో ఉమ్మడి జిల్లా నేతలు

దూసుకుని పోతున్న గులాబీ అభ్యర్థులు

నేరుగా ఓటర్లను కలుస్తూ వేడుకుంటున్న నాయకులు

వరంగల్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నేతలంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటి ప్రచారంతో ఎక్కువగా దూసుకుపోతున్నారు. నేరుగా ప్రజలను కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. నాలుగేళ్ల తెలంగాణ అభివృద్దిని ఏకరువు పెడుతున్నారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం టిఆర్‌ఎస్‌ అభ్యర్థి దాస్యం వినయ్‌ భాస్కర్‌ మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్‌ అమలు చేస్తున్న పథకాలపై ఆయన ప్రజల్లో చైతన్యం తెచ్చారు. బంగారు తెలంగాణ ఏర్పడాలంటే, మళ్లీ కెసిఆరే సిఎం కావాలని ఆయన పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ వందకు పైగా సీట్లు సాధించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా 38 డివిజన్లలో భారీ ర్యాలీ తీశారు. ఈ ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్‌

నేతలు మర్రి యాదవరెడ్డి, వాసుదేవరెడ్డి, మాధవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నాలుగేళ్లలో ని యోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని, ఈ ఎన్నికల్లో మళ్లీ ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని పాలకుర్తి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలోనే కుల సంఘాలకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు.రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అనేక పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. గోదావరి జలాలతో పాలకుర్తి నియోజక వర్గంలోని అన్ని చెరువులు నింపి, సస్యశ్యామలం చేయడమే తన ధ్యేయమన్నారు. ప్రతి పక్షాల తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. రాష్ట్రంలోని కర్షకుల కన్నీళ్లు తుడిచేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు పురుడుపోసుకున్నదని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి, రైతాంగానికి భరోసానిచ్చిన మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఏడాదిలో రెండు పంటలకు సాగునీరు అందించేలా ప్రణాళికలు చేపడుతున్నట్లు చెప్పారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి నియోజకవర్గాన్ని ఊహించని రీతిలో అభివృద్ధి చేసి, మళ్ళీ ఓట్లు అడిగేందుకు వస్తున్నారన్నారు. అభివృద్ధికి మరోసారి పట్టం కట్టి మరింత అభివృద్దిని సాధించుకోవాలన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని స్పీకర్‌ మధుసూదనాచారి అన్నారు. పలు గ్రామాల్లో మధుసూదనాచారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ నేతలు కబ్జాలు పెట్టి ప్రజల పొట్ట కొట్టారని విమర్శించారు. గత పాలకులు ప్రజల అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు. మారుమూల గ్రామాలను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు.కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు గ్రామాలపై కనీస అవగాహన కూడా లేదని దుయ్యబట్టారు. ప్రజల సమస్యలపై తన దగ్గరకు వస్తే ఎప్పటికప్పుడు పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. తన దృష్టికి వచ్చిన పోడు భూముల సమస్యను చాలా చోట్లా పరిష్కరించానని తెలిపారు. ఇక వర్దన్నపేటలో ఆరూరి రమేశ్‌ ప్రచారం జోరందుకుంది. టీఆర్‌ఎస్‌ విజయం కోసం కార్యకర్తలంతా సైనికుల్లాగా పనిచేయాలని వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ కోరారు. నిత్యం నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేసిన తనను ప్రజలంతా ఆశీర్వదిస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌కు గతంలో కంటే మెజార్టీ వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.

ప్రజా పక్షాన నిలిచి వారి ప్రగతే లక్ష్యంగా నాలుగన్నరేండ్లలో 426 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన కేసీఆర్‌కు మళ్లీ పట్టం కట్టాలని, కారు హైవే ఎక్కిందని, దాని జోరును ఆపడం ఎవ్వరితరం కాదని మానుకోట మాజీ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు.కాంగ్రెస్‌ టీడీపీలది మహా కూటమి కాదని అది మాయ కూటమని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌ను ఎన్నికల్లో ఎదిరించే ధైర్యం లేకనే చిన్నా చితకా పార్టీలన్ని ఏకమై కూటమిగా ఏర్పాటయ్యాయన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకోలేని సీమాంధ్ర పార్టీలు ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించాయన్నారు.