.ఇంటి వద్దకే వరద సాయం

– మీ సేవకు రావద్దు

– జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌

హైదరాబాద్‌,డిసెంబరు 7 (జనంసాక్షి): హైదరాబాద్‌ నగరంలో వరద బాధితులెవరూ విూ-సేవ సెంటర్లకు రావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల వచ్చిన వరదల వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం అందించే ఆర్థికసాయాన్ని నేరుగా బాధితుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. బాధితుల వివరాల ధ్రువీకరణ పూర్తి అయ్యాక ఈ మేరకు చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. వరద సాయం కోసం బాధితులెవరూ విూ-సేవ సెంటర్ల చుట్టూ తిరగొద్దని విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి సాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం బాధితుల వివరాలు, ఆధార్‌ నంబర్‌ ధ్రువీకరణ జరుగుతోందని కమిషనర్‌ వివరించారు. ముంపునకు గురైన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం రూ.10వేల ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. సాయం అందని వారు విూసేవ కేంద్రాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్న సర్కారు సూచనల మేరకు బాధితులు విూసేవ కేంద్రాల చుట్టూ తిరిగారు. కాగా, గ్రేటర్‌ ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో పంపిణీ నిలిపివేశారు. ఎన్నికల అనంతరం వరద సాయం పంపిణీ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే.జీహెచ్‌ఎంసీ బృందాలు పరిశీలించి అకౌంట్లలో జమ చేస్తామని కమిషనర్‌ పేర్కొన్నప్పటికీ వరద బాధితులు విూ సేవ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. కుత్బుల్లాపూర్‌, షాపూర్‌ నగర్‌, జీడీమెట్ల, సురారం ప్రాంతాల్లోని పలు విూ సేవ కేంద్రాల్లో రద్దీ నెలకొంది.