ఇండోనేషియాలో సముద్రంలోకి జారిన విమానం
ప్రయాణికులు సురక్షితం
బాలి, (జనంసాక్షి) :
ఇండోనేషియాలో శనివారం ఘోర విమాన ప్రమాదం తప్పింది. బాలిలోని అంతర్జాతీయ విమాశ్రాయంలో దిగబోతు ఓ దేశీయ విమానం పక్కనే ఉన్న సముద్రంలోకి జారిపోయింది. లయన్ ఎయిర్ లైన్స్ విమానం బాలి విమానాశ్రయం రన్‌వేపై దిగబోతూ పక్కనే ఉన్న సముద్రంలోకి దూసుకుపోయింది. ఆ సమయంలో విమానం 50 మీటర్ల ఎత్తులో ఉన్నట్లు సమాచారం. విమానం సముద్రం ఒడ్డుపైగా జారిపోవడంతో ప్రాణాపాయం సభవించకున్న ప్రయాణికులంతా నీటిలో తడిసిపోయారు. లైఫ్ జాకెట్ల సాయంతో నీటిపై తేలియాడుతున్న ప్రయాణికులను లయన్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది, ప్రభుత్వ సహాయక విభాగం సిబ్బంది రక్షించి సమీపంలోని ఆస్పత్రలకు తరలించారు. ఈ ప్రమాదంలో 25 మంది గాయపడ్డట్టుగా ఇండోనేషియా పౌర విమానయాన శాఖ మంత్రి వెల్లడించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఇండోనేషియా పౌరవిమానయాన శాఖ భిన్నమైన ప్రకటనలు జారీ చేసి ప్రజలను గందరగోళ పరిచింది. తొలుత విమానంలో 130 ప్రయాణికులున్నట్లు ప్రకటించగా, ఆ తర్వాత 108 మంది ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్నారు. చివరికి ఏడుగురు విమాన సిబ్బంది, 95 మంది పెద్దవాళ్లు, ఐదుగురు చిన్నారులు, పసికందు ప్రయాణిస్తున్నట్లు తేల్చారు. అలాగే గాయపడిన వారి సంఖ్యపై తొలుత గందరగోళం నెలకొంది. దీంతో ఆ విమానంలో ప్రయాణిస్తున్న వారి బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని పేర్కొనడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా మంత్రి ప్రకటన తర్వాత కూడా గాయపడ్డవారి సంఖ్యపై స్పష్టత కొరవడింది. సముద్రం లోపలికని విమానం దూసుకువెళ్లి ఉంటే పెను ప్రమాదం సంభవించేది.