ఇక ఉద్యమం ఉరుముతది

 

హైదరాబాద్‌, డిసెంబర్‌ 1(జనంసాక్షి):

వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో అన్ని పార్టీలూ తెలంగాణపై తీర్మానం చేయాలని తెలంగాణ జెఎసి ఛైర్మన్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం నాడు తెలంగాణ జెఎసి స్టీరింగ్‌ కమిటీ సమా వేశం జరిగింది. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌, బిజెపి, న్యూడెమొక్రసి పార్టీల నేతలు పాల్గొన్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కోదండరామ్‌ మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీ, టిడిపి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణపై తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయా పార్టీలతోత తీర్మానం చేయించే బాధ్యతను తెలంగాణ నేతలే తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేనిచో ఆ పార్టీల తెలంగాణ నేతలను టార్గెట్‌ చేసుకొని తమ ఉద్యమాలను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణపై ఆయా పార్టీల తెలంగాణ నేతలు మెసలికన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. తెలం గాణపై తీర్మానంతో ఆ పార్టీల తెలం గాణ నేతల నైజం బయటపడుతుందని కోదండ రామ్‌ అన్నారు. తీర్మానం కోసం పాటుప డకపోతే వారిని టార్గెట్‌ చేసుకుంటూ తెలంగాణ ప్రజలను ఎలా మోసగించింది ప్రజలకు

వివరిస్తామని అన్నారు. సీమాంధ్ర నేతల గుప్పిట్లో కేంద్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. తెలంగాణ ఇవ్వాలని అడిగే రోజులు ఇక లేవని, పోరాటాల ద్వారానే తెలంగాణను సాధించుకుంటామని కోదండరామ్‌ అన్నారు. డిసెంబర్‌ 9వ తేదీని తెలంగాణ సాధన దినోత్సవంగా జరుపుకొని కొవ్వొత్తులు, కాగడాల ర్యాలీలు నిర్వహిస్తామని అన్నారు. డిసెంబర్‌ 23న తెలంగాణ విద్రోహదినంగా పాటిస్తామని కోదండరామ్‌ అన్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీలు చేపడుతామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణపై ఆయా పార్టీలు మాట తప్పితే 10లక్షల మందితో చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడుతామని కోదండరామ్‌ హెచ్చరించారు.

సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కాంగ్రెస్‌, టిడిపి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు ఏ మాత్రం గౌరవించడం లేదని ఆ పార్టీలకు అనుగుణంగానే అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయని కోదండరామ్‌ అన్నారు. ఏపిఎస్‌ఆర్‌టిసిలో జరుగుతున్న కార్మిక సంఘాల ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌కే జెఎసి మద్దతు ఇస్తుందని కోదండరామ్‌ తెలిపారు.

ఇదిలా ఉండగా జెఎసి స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో జిల్లాల నుంచి వచ్చిన జెఎసి నేతలు తమ అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్టు వివరించారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసిఆర్‌, ఛైర్మన్‌ కోదండరామ్‌, బిజెపి నేతల సమక్షంలోనే వారు తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా స్పష్టం చేసి నాయకుల తీరును ఎండగట్టారు. మహబూబ్‌నగర్‌, పరకాల ఉప ఎన్నికల్లో జెఎసి విశ్వసనీయత దెబ్బతిన్నదని చెప్పినట్టు సమాచారం. ఈ రెండు ఉప ఎన్నికల్లో పార్టీలు వ్యవహరించిన తీరు తెలంగాణ వాదులను గందరగోళ పరిచిందని ఆయా జిల్లాల జెఎసి నాయకులు చెప్పారు.

ఉప ఎన్నికల్లో మాదిరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌, బిజెపి అభ్యర్థులు పోటి పడితే తెలంగాణ వాదులు మరింత అయోమయానికి గురవుతారని చెప్పారు. అందువల్ల ఎవరో ఒక్కరే పోటీ చేయాలని అప్పుడే ప్రజల్లో స్పష్టత వస్తుందని వారు సూచించినట్లు తెలిసింది. ఉప ఎన్నికల పరిస్థితులను పునరావృతం చేయొద్దని వారు బిజెపి,టిఆర్‌ఎస్‌ నాయకులను కోరారు. కాగా జెఎసి ఛైర్మన్‌ కోదండరామ్‌పై ఎమ్మార్పీ ఎస్‌ నాయకుడు మంద కృష్ణ మాదిగ పెద్ద ఎత్తున విమర్శలు చేసినా జెఎసి నాయకులు ఎవరూ నోరు మెదపకపోవడం పట్ల కేసీఆర్‌ వారిపై మండిపడ్డారని తెలిసింది. ఎక్కడ పడితే అక్కడ మంద కృష్ణ తీవ్రమైన విమర్శలు చేస్తుపోతుంటే జెఎసి నాయకులు ఎవరూ ఎందుకు ప్రతిఘటించలేదని ఆయన ప్రశ్నించారు అని తెలిసింది. మొత్తం మీద తెలంగాణ ఉద్యమానికి నష్టం కలగని విధంగా ఉద్యమించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఎదరుయ్యే ఆటంకాలను అధిగమించాలని నిర్ణయించారు. తెలంగాణ ఉద్యమంలో చిచ్చుపెట్టేందుకు, నాయకుల మధ్య ఐక్యతను దెబ్బతిసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతాయని వాటిని జాగ్రత్తగా గమనిస్తు, తిప్పికొడుతూ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించారు. జెఎసి స్టీరింగ్‌ సమావేశంలో కేసిఆర్‌, నాయిని నరసింహారెడ్డి, కోదండరామ్‌తో పాటు బిజెపి నేతలు కిషన్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్‌, టీఎన్జీవో నేతలు దేవిప్రసాద్‌, విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.