ఇక చర్చలు లేవు …ఎంసెట్‌ మేమే నిర్వహిస్తాం

4
తెలంగాణ ఇంటర్‌ లోగో విడుదల చేసిన మంత్రి జగదీష్‌ రెడ్డి

హైదరాబాద్‌,జనవరి5(జనంసాక్షి)::  ఎంసెట్‌ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. తమ ఎంసెట్‌ం తామే నిర్వహించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలని ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం అడుగడుగునా ఉల్లంఘిస్తుందని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు లోగోను ఆవిష్కరించిన మంత్రి మాట్లాడుతూ… కేంద్రం చేసిన చట్టాలకు అనుగుణంగా ఎవరైనా నడుచుకోవాల్సిందేని తేల్చి చెప్పారు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఏదో విధంగా పంచాయితీ పెడ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్టాన్న్రి , ప్రజలను గౌరవించాలన్న సోయి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి లేదని, తెలంగాణ ప్రజలపై ఇంకా పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వమే ఎంసెట్‌ నిర్వహిస్తుందని తెలిపారు. ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం మమ్మల్ని సంప్రదించకుండానే ఎంసెట్‌తో పాటు పలు సెట్ల తేదీలు ప్రకటించింది. తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరగడానికే ఎంసెట్‌ నిర్వహిస్తామని చెప్పారు. ఎంసెట్‌పై గవర్నర్‌ను ఎన్నిసార్లు కలవడానికైనా సిద్ధంగా ఉన్నామని, సాధ్యమైనంత త్వరగా ఎంసెట్‌ తేదీలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. ప్రతి విషయాన్ని ఆందప్రదేశ్‌ ప్రభుత్వం రాద్దాంతం చేస్తున్నదని జగదీష్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.కేంద్రం చేసిన చట్టం నచ్చినా,నచ్చకపోయినా, తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండగా, ఎపి మాత్రం ప్రతి విషయాన్ని రాద్దాంతం చేస్తున్నదని ఆయన అన్నారు.  ఎపి ప్రభుత్వం ముందుగా ఏకపక్షంగా ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల చేసి తమను తప్పుపడుతోందని ఆయన అన్నారు.దీనిని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన చెప్పారు. ఎంసెట్‌ సహా అన్ని సెట్ల షెడ్యూల్‌ విడుదల చేస్తామని అన్నారు. విభజనచట్టం ప్రకారం తమకే హక్కు ఉందని, కావాలంటే ఎపికి కూడా ఎమ్సెట్‌ నిర్వహిస్తామని ఆయన అన్నారు.