ఇక మద్యం ఫుల్‌ కిక్‌ భారీగా ధర పెంపు

హైదరాబాద్‌,నవంబర్‌30 (జనంసాక్షి): మద్యం బాబులకు దిమ్మదిరిగేలా ప్రభుత్వం భారీగా ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా ధరలకు రెక్లొచ్చేలా కిరణ్‌ సర్కార్‌ తెరలేపింది. దీంతో మద్యం బాబుల జేబులకు ప్రభుత్వం చిల్లు పెట్టింది. సర్‌ఛార్జీలతోపాటు- ఏవైనా ధరలు పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర సీఎం ప్రకటించి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మందు బాబులపై భారం పడింది. ప్రభుత్వం మద్యం ధరలను భారీగా పెంచింది. ఈమేరకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన ధరలు శుక్రవారం అర్దరాత్రి నుంచే అమలులోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మద్యం ధర రూ.300లోపు ఉంటే 2 శాతం పన్నును విధించనున్నారు. రూ.301 నుంచి రూ.450 మధ్య ధర ఉంటే 29.5 శాతం, రూ.451 నుంచి రూ.500 వరకు ధర ఉంటే 32 శాతం, రూ.501 నుంచి రూ.1000 వరకు ధర ఉంటే 37 శాతం, రూ.1001 నుంచి రూ.2000 వరకు ధర ఉంటే 37 శాతం, రూ.2001 ఆపైన ధరలు ఉండే మద్యం బాటిళ్లపై 15 శాతం పన్నును విధిస్తున్నట్టు- ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ధరల కారణంగా సర్కార్‌కు భారీగా ఆదాయం సమకూరనుంది. ఒక్క గుంటూరు జిల్లా నుంచే సర్కార్‌ ఖజానాకు కనీసం నెలకు పదికోట్ల వరకు ఆదాయం అదనంగా రాగలదని భావిస్తున్నారు. మద్యం ధరలపెంపుపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. సర్కార్‌కు అదనపు ఆదాయం కోసం ఇలా మద్యం రేట్లను పెంచడం సరికాదన్నారు.