ఇక వేగంగా మిషన్‌ భగీరథ పనులు


పాలేరు జలాశయం నుంచి ఖమ్మం తాగునీటికి ప్రణాళిక
ఖమ్మం,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): ఇక మిషన్‌ భగీరథ పనులు వేగం కానున్నాయి. పనుల వేగానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నారు.  ఖమ్మంలో మంచినీటి అవసరాల కోసం పాలేరు జలాశయం నుంచి నీటిని సరఫరా చేస్తారు.పాలేరు నుంచి మంచినీటిని ఖమ్మం నగరపాలక సంస్థకు నిత్యం సరఫరా చేసేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. మరోవైపు పాలేరు జలాశయంలో నీరు వృధాగా పోకుండా వర్షాకలంలో నీటి మళ్లింపును పూర్తిగా వినియోగిస్తారు. ఈ ట్యాంకులను నింపేందుకు జీళ్లచెర్వు వద్ద గుట్టపై ఓ ట్యాంకును నిర్మిస్తున్నారు.  ఈ మేరకు పాలేరు నుంచి నీటిని నగరపాలక సంస్థలో నిర్మించనున్న 15 ట్యాంకులకు సరఫరా చేయనున్నారు. దీంతో నీటి సమస్య ఉండదని భావిస్తున్నారు. ఇప్పటికే పాలేరు నుంచి పైపులైన్ల నిర్మాణ పక్రియ కొనసాగుతోంది. ఇక నగరపాలకంలో ట్యాంకుల నిర్మాణాన్ని ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ విభాగం పర్యవేక్షించనుంది.  ప్రజలందరికీ ప్రతిరోజు మంచినీరు అందించాలన్న లక్ష్యంతో అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ పథకం కింద ఖమ్మం నగరపాలక సంస్థను తొలి ప్యాకేజీ కింద చేర్చుతూ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.  ఇకపోతే అమృత్‌’ పథకం కింద రూ.374 కోట్లతో ఖమ్మం నగరపాలకం నుంచి ప్రతిపాదనలు కేంద్రానికి పంపారు. దానికి కేంద్రం ఆమోదించడంతో పాటు, తొలి విడత నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టెండర్ల నిర్వహణ, ప్యాకేజీల వారీగా చేపట్టాల్సిన పనులు, నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాలను జారీచేసింది.