ఇచ్చిన హావిూలు అన్నీ నెరవేర్చానన్న పోచారం


బాన్సువాడలో చిల్డన్ర్‌ పార్కును ప్రారంభించిన స్పీకర్‌
కామారెడ్డి,అగస్టు11(జనం సాక్షి): బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఇచ్చిన హావిూలను అన్నింటినీ నెరవేర్చానని శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. జిల్లాలోని బాన్సువాడ పట్టణ పరిధిలోని 10వ వార్డ్‌ చైతన్య కాలనీలో నూతనంగా అభివృద్ధి చేసిన చిల్డన్ర్‌ పార్క్‌కు ప్రారంభోత్సవం చేశారు.17వ వార్డులో రూ.15 లక్షలతో నిర్మించనున్న వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలోని కల్యాణ మండపానికి,16వ వార్డులో రూ.15 లక్షలతో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని కల్యాణ
మండపానికి బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ..బాన్సువాడ నియోజకవర్గానికి ఇప్పటికే పదివేల ఇండ్లు మంజూరు అయ్యాయి. భవిష్యత్తులో నియోజకవర్గ పరిధిలో నాకు సొంత ఇళ్లు లేదు అనేవారు ఉండకూడదు అన్నదే నా ఆశయం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు నియోజకవర్గానికి చేరుతున్నాయి. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో అన్ని కులాల సంఘాలకు కమ్యునిటీ భవనాలను నిర్మించామని స్పీకర్‌ తెలిపారు. వాడవాడలా సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాం. నియోజకవర్గ పరిధిలో దేవాలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులను మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. బీర్కూరు మండలం తిమ్మాపూర్‌ గ్రామ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానం పరధిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. తిమ్మాపూర్‌ దేవాలయం అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా రూ.23 కోట్లను మంజూరు చేశారన్నారు. ఈ నిధులతో ప్రధాన ఆలయం అభివృద్ధి, మాడ వీధులు, రాజగోపురాలు, కల్యాణ మండపంతో పాటుగా భక్తులకు అవసరమైన అన్ని వసతులను సమకూర్చుతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.