ఇదిగో.. లేఖ
– ఆర్డీఎస్‌కు సహకరించండి
– ఏపీకి తెలంగాణ సర్కారు లేఖ
హైదరాబాద్,మే18(జనంసాక్షి): రాజోలిబండ వ్యవహారంలో ఏపీ మంత్రి దేవినేని ఉమ చేసిన డిమాండ్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు కర్నూలు జిల్లా కలెక్టరు రాసిన లేఖను బహిర్గతం చేసింది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు రాజోలి బండ వ్యవహారంలో తెలంగాణకు సహకరించాలి అన్నారు.రాజోలిబండ మళ్లింపు పథకం పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించేలా చూడాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి… కృష్ణా బోర్డు కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం, కృష్ణా ట్రైబ్యునల్ ప్రకారం తెలంగాణకు రావాల్సిన 15.90 టీఎంసీల నీరు దక్కాలంటే ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు జరగాల్సిందేనని జోషి లేఖలో పేర్కొన్నారు. ఆనకట్ట ఎత్తు పెంపు వల్ల కర్నూలు జిల్లా రైతులకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేసిన ఆయన…. ఆధునికీకరణ పనులకు సహకరించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి సూచించాలని బోర్డును కోరారు. అటు ఆర్డీఎస్ పనులు ఆపాలంటూ కర్నూలు జిల్లా అధికారులు రాసిన లేఖను ప్రభుత్వం విడుదల చేసింది. రైతుల ఆందోళన దృష్ట్యా పనులు ఆపాలని రాయచూర్ జిల్లా సింధనూర్ ఆర్డీఎస్ ఈఈకి కర్నూలు జిల్లా ఆదోని ఆర్డీఓ, డీఎస్పీలు ఈనెల 16వ తేదీన లేఖ రాశారు. ఈ మేరకు లేఖ ప్రతిని నీటిపారుదల శాఖ కార్యాలయం విూడియాకు విడుదల చేసింది.