ఇది ఆఖరి పోరాటం అదే స్థాయిలో ఉండాలి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇదే ఆఖరి పోరాటం. ప్రజలందరూ ఒక్కటై ఇళ్లూ, వాకిలి విడిచిపెట్టి ఉద్యమ బాట పట్టాల్సిన సమయం. మనం పోరాడ్డమే కాదు తెలంగాణ ప్రజల ఆకాంక్షతో ఆడుకుంటున్న ఈ ప్రాంత మంత్రులను, ఎమ్మెల్యేలను బరిగీసి రోడ్డుపైకి ఈడ్చుకు రావాల్సిన సమయం. ఇప్పుడు కాకుంటే తెలంగాణ సాధనకు మరెన్నో ఉద్యమాలు చేయాల్సి ఉంటుంది. కేంద్రం నిర్ణయం ప్రకటిస్తామని వెనక్కి తగ్గినా, సీమాంధ్రులు డబ్బు సంచులు దాని ముందు కుమ్మరించినా మనం ఎంతమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన సంకల్పం.. మన లక్ష్యం.. మన ఆకాంక్ష.. మన పోరాటంలో న్యాయముంది. ఆత్మగౌరవం, స్వపరిపాలన, వనరులు, నీళ్లు, నిధులు, ఉద్యోగాల రక్షణ కోసం చేపట్టిన ఆకలి పోరాటం మనది. తెగదిని అన్నమరగని స్థితిలో ఉన్న సీమాంధ్ర పెట్టుబడిదారులు సృష్టించే ఆటంకాలతో జడుసుకుంటే అంతకుమించిన దౌర్భాగ్యం మరొకటి ఉండదు. 1969లో మొదలైన పోరాట స్ఫూర్తిని ఆరిపోని జ్వాలల ఉంచిన తెలంగాణ అమరవీరులను జ్ఞప్తికి తెచ్చుకొని ముందుకురుకుదాం. జై తెలంగాణ అని నినదిస్తూనే తోటి వారిని వెంటబెట్టుకుని ముందుకు సాగుదాం. ఆత్మగౌరవం కోసం ఆందోళన బాటే వీడని గుజ్జర్లే మనకు ఆదర్శం. వారి పోరాట స్ఫూర్తితో మనమూ ముందుకు సాగుదాం. కేంద్రాన్ని వణికించేలా ఉద్యమ బాటన నడుద్దాం. నాలుగు దశాబ్దాలుగా ఏ ఆకాంక్ష కోసం పోరాడుతున్నామో.. నాలుగున్నర కోట్ల గొంతుకలు ఏ నినాదాన్ని చేస్తున్నాయో.. అది సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరం చేయి కలుపుదాం. ఇదే ఆఖరి పోరాటం అనే మంత్రాన్ని జపిస్తూనే సీమాంధ్ర పెట్టుబడిదారులు, ఇక్కడి తెలంగాణ ద్రోహులు, ఆడితప్పిన కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఉద్యమ పథాన ముందుకేగుదాం. ఆఖరి పోరాటమంటే కచ్చితంగా ఫలితాన్ని రాబట్టుకునే స్థాయిలోనే ఉండాలి. మన ఆకాంక్షకు అడ్డొచ్చే వారిని, వారికి ఆ శక్తిని ఇస్తున్న వనరులను లక్ష్యంగా చేసుకునే ఉద్యమం నడపాలి. వారిస్తున్న డబ్బు సంచులు మూటగట్టుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఢిల్లీలో అపహాస్యం చేస్తున్న శక్తులను అదే స్థాయిలో ఢీకొట్టాలి. అందుకు మనం శక్తులు సంతరించుకోవాలి. అంటే సీమాంధ్రుల్లా డబ్బుమూటలు కట్టే స్థాయి మనకాడ లేదు. ప్రజలే మన బలం. మూకుమ్మడి పోరాటాలే మన ఆయుధం. ప్రజాస్వామ్య యుతంగా ఇంతకాలం సాగించిన పోరాటం సత్ఫలితాలు ఇవ్వలేదంటే మనలోనైనా లోపముండాలి.. మనం సాగించే పోరాట పంథాలోనైనా లోపముండాలి. ఆ లోపాలను సరిచేసుకోవాలి. సింగిల్ టార్గెట్ సాధించాలనుకున్నప్పుడు గురి తప్పకుండా బాణం వేయాలి. విడిచిన బాణం లక్ష్యాన్ని చేరుకునేలా సంధించాలి. ప్రజాస్వామ్యయుతంగా పోరాటం సాగిస్తూనే సీమాంధ్రుల ఆర్థిక మూలాలు దెబ్బకొట్టేందుకు వారి ఉత్పత్తుల బహిష్కరణకు ముందుకు రావాలి. లేకుంటే వారు మన డబ్బులను కూడ బెట్టుకొని, మన వనరులను దోచుకొని వాటితోనే మన ఆకాంక్షను మళ్లీ చిదిమేయడం ఖాయం. అందుకే ప్రతి తెలంగాణ పౌరుడూ, ప్రతి విద్యార్థి, ఉద్యోగి, కార్మికుడు, కర్షకుడు మళ్లీ సమ్మెకు సిద్ధపడాలి. కళ్లబొళ్ల మాటలు, కంటి తుడుపు ప్రకటనలకు లొంగకుండా కచ్చితంగా లక్ష్యమే ఛేదించాలి. ఈ క్రమంలో రాళ్లు, ముళ్లూ ఎదురైనా వెరువకుండా కపట రాజకీయ నాయకులను నమ్మకుండా ప్రజలే ఉద్యమానికి కేంద్ర బిందువులై వ్యవహరించాలి. ఇప్పటికే ఆలస్యం జరిగింది. తెలంగాణపై కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వం తొలి ప్రకటన జారీ చేసి మూడేళ్లు గడిచింది. నెలరోజుల్లో తేల్చేస్తామన్న మలి ప్రకటనా తుస్సుమంది. కాంగ్రెస్‌కు మోసం చేయడం అలవాటే. మోసపోవడాన్ని మనం అలవాటుగా మార్చుకోవద్దు. గుప్పెడు మంది పెట్టుబడిదారులకు ఒత్తిడికి అంత శక్తి ఉంటే నాలుగున్నర కోట్ల ప్రజల ఏకైక సంకల్పానికి ఎంత శక్తి ఉండాలి. ఆ శక్తి ఎంతటిదో కేంద్రానికి తెలిసేలా చేయాలి. ప్రజల ఆకాంక్షను గౌరవించని అధికారపక్షానికి తదుపరి ఎన్నికల్లో గూభ గుయ్ మనిపించేలా తీర్పునివ్వాలి. తాత్కాలిక ప్రలోభాలకు తాము లొంగబోమని చాటిచెప్పాలి. మన బిడ్డల ఆత్మత్యాగాలను పట్టించుకోని పార్టీకి గుణపాఠం చెప్పాలి. అంతకంటే ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మొస తీసుకునే అవకాశం కూడా సీమాంధ్ర పెట్టుబడిదారులు, యూపీఏ-2 ప్రభుత్వానికి ఇవ్వకుండా ఉద్యమాన్ని ముందుకు నడిపించాలి. ఇందుకు ప్రతి ఒక్కరు కంకణ బద్ధులు కావాలి.