ఇది బంద్‌ల కాలం
నెల్లూరు, జూన్ 27 : ప్రభుత్వం జూన్ నెల రెండవ వారం నుంచి పాఠశాలలు తెరిచినప్పటికీ పాఠశాలలో, కళాశాలలో మౌలిక సదుపాయాలు లేవని ఆరోపిస్తూ ఒకవైపు విద్యార్థి సంఘాలు ప్రతిరోజు బంద్‌లు నిర్వహిస్తుండగా, ఉపాధ్యాయుల బదలీల కౌన్సెలింగ్‌లో అన్యాయం జరుగుతుందంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగుతుండడంతో పాఠశాలలు, కళాశాలలు తెరిచిన విద్యార్థులు విద్యాలయాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడి ఒక వేళ వెళ్లినా ఉపాధ్యాయులు రాకపోవడంతో కేవలం విద్యార్థులు నామ మాత్రంగానే పాఠశాలల్లో కూర్చోవాల్సి వస్తోంది. గత మూడు రోజులుగా జరుగుతున్న ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ నేపథ్యంలో జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయం ధర్నాలతో, ఆందోళనతో సందడిగా కనిపిస్తుండగా మరోవైపు పాఠశాలలోను, కళాశాలలోను మౌలిక సదుపాయాలు లేవని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు ప్రతిరోజు కళాశాలలను, పాఠశాలలను మూసి వేయిస్తున్నాయి. ఈ వారంలో తెలుగు విద్యార్థి సంఘం, ఎస్‌ఎఫ్‌ఐలు కళాశాలల బంద్‌కు పిలుపు ఇవ్వగా బుధవారంనాడు ఏబీవీపీ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళశాలలు మూతపడ్డాయి.