ఇది మాత్రమే ప్రజాస్వామ్యంపై దాడా?

ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్‌ సమీపంలో కాంగ్రెస్‌ నేతల క్యాన్వాయ్‌ను మావోయిస్టులు బాంబులతో పేల్చిసి కొందరిపై కాల్పులు జరపడాన్ని భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. ఇంచుమించు అలాంటి అభిప్రాయాన్నే ప్రధాన ప్రతిపక్షం బీజేపీ సహా మిగతా రాజకీయ పార్టీలూ వ్యక్తపరిచాయి. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మావోయిస్టులు జరిపిన మారణకాండను ఖండించాల్సిందే. దీనిపై ఎవరికీ రెండో అభిప్రాయం లేదు. కానీ ఈ ఘటన మాటున దాగున్న ఎన్నో నగ్నసత్యాలు, కఠోర వాస్తవాలను మెరుగు పర్చాలనే ప్రయత్నం మాత్రం క్షమించరానిది. దండకారణ్యంలో నిక్షిప్తమై ఉన్న అపార ఖనిజ సంపదపై కన్నేసిన కార్పొరేట్‌ శక్తులు పాలకపక్షాలతో చేతులు కలిపి సాగించిన దారుణ మారణఖండ బాహ్య ప్రపంచానికి తెలియకుండా చేశారు. అడవిలో తప్ప జనారణ్యంలో బతకడమే తెలియని ఆదివాసీ గొత్తికోయలను అడవి నుంచి తరిమేసేందుకు ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌కు రూపకల్పన చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం ప్రాంతంలో అక్కడి ప్రభుత్వ పాలన కాకుండా మావోయిస్టుల నేతృత్వంలోని జనతనసర్కార్‌ రాజ్యమేలుతుందనేది అందరికీ తెలిసిన విషయం. మావోయిస్టులు ప్రజల పక్షాన పాలన సాగిస్తే పాలకులు కార్పొరేట్‌ శక్తుల ప్రయోజనాల కోసం పనిచేస్తారనేది ఎవరూ కాదనలేని వాస్తవం. దండకారణ్యంలో ఎక్కువ జీవనం సాగించే జాతులు కోయలు, గొత్తికోయలు. కోయలు ఇక్కడ ఆధిపత్యవర్గాలు. అభివృద్ధి తాలూకు ఫలాలు వీరికి కాస్తో కూస్తో అందాయనే చెప్పాలి. అందుకే వీరు రాజ్యం పక్షాన నిలిచి తమతో పాటే జీవనం సాగించే గొత్తికోయలకు నిలువనీడ లేకుండా చేయాలని శతవిధాలు ప్రయత్నించారు. అలాంటి వారిని చేరదీసి మావోయిస్టులపై పోరుకు తుపాకులిచ్చి ముందుకు నడిపించిన వ్యక్తి మహేంద్రకర్మ. కేంద్రంలో 2004 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రపంచకీరణ, నూతన ఆర్థిక విధానాలు, కార్పొరేట్‌ భాగస్వామ్యంలో పరిశ్రమల కల్పన, అందుకు అడ్డగోలుగా నిబంధనలు పక్కనబెట్టడంతో భారత పాలక ప్రతిపక్షాలకు ఎంతో భావసారూప్యత ఉంది. అందుకు నిదర్శనమే కాంగ్రెస్‌ నేత మహేంద్ర కర్మ నేతృత్వంలో పురుడుపోసుకున్న సల్వజుడుం. బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉండగా కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పడిన సల్వజుడుం మావోయిస్టులపై పోరుకు తెగపడింది. 12 ఏళ్ల పసిబాలురకు తుపాకులిచ్చి మావోయిస్టులకు సహకరించే గొత్తికోయలు, ఆదివాసీలపై యుద్ధానికి తెరతీసింది. గిరిజనులు నివాసమున్న ప్రాంతంలోని అపారమైన ఖనిజ సంపదపై వారికే హక్కు కల్పించాలనే పేరుతో సల్వజుడుం నేతృత్వంలో వారిపైనే యుద్ధం సాగించారు. ఆదివాసీలు, గొత్తికోయలను దండకారణ్యం నుంచి వెళ్లగొట్టి ఖనిజ సంపద, మినరల్స్‌ వెలికి తీసి నయా బిలియనీర్ల అవతారమెత్తాలనుకునే కొన్ని శక్తులకు మావోయిస్టులు అడ్డుగా నిలిచారు. గొత్తికోయలకు అండగా నిలిచారు. భారత ప్రభుత్వాన్ని వ్యతిరేకించే మావోయిస్టులకు సహకరిస్తున్నారనే నెపంతో దండకారణ్యంలో ఏర్పాటు చేసిన సీఆర్పీఎఫ్‌ బేస్‌ క్యాంపుల్లోని పోలీసులు, సల్వజుడుం ఎస్పీవోలు సాగించిన మారణహోమం బాహ్య ప్రపంచానికి తెలియంది కాదు. వేలాది మంది అమాయక ఆదివాసీ మహిళలను వీరు అత్యంత అమానవీయంగా చెరిచి హత్య చేసిన సంఘటనలు ఎవరూ ఎత్తి చూపారు. ఇది అప్రజాస్వామికమని ఎవ్వరూ గొంతెత్తరు. సల్వజుడుం కార్యకలాపాలను వ్యతిరేకించేవారి రెక్కలు విరిచి కట్టి గొంతులు కోసిన విషయం మీడియా సాక్షిగా ఎన్నో పర్యాయాలు వెలుగు చూసింది. భారతదేశంలోనే జన్మించిన గొత్తికోయల కనీస జీవించే హక్కును కాలరాసింది ఈ ప్రభుత్వమే. చిన్నారులకు కనీసం పౌష్టికాహారం కూడా అందించకుండా వారిని పసిప్రాయంలోనే మృత్యుఒడికి చేర్చింది ఈ పాలకులే. అలాంటి పాలకులు ఇప్పుడు తమ పార్టీ వారిపై జరిపిన మారణకాండను ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించడం విచారకరం. ఇంతకాలం వారి కనుసన్నల్లో దండకారణ్యంలో జరిగిన మారణకాండ, గాల్లో కలిసిన ప్రాణాలు, మనం కోల్పోయిన బాలికలు, మహిళల ఆర్తనాదాలకు వీరిది కాదా బాధ్యత? అప్పుడు వీరు సాగించింది ధర్మ యుద్ధం. భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించి ఎదురుతిరిగిన మావోయిస్టులపై జరిపిన పోరాటం. ఇక్కడ పాలకులు గుర్తించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దండకారణ్యంలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించే గొత్తికోయలు ఇటు పోలీసులు, అటు మావోయిస్టుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. అనివార్యంగా ఇరువర్గాలకు ఆశ్రయం ఇచ్చిన వారే. ఎవరిని కదన్నా వారు అక్కడ బతికి బట్టకట్టడం అసాధ్యం. అలాంటి పరిస్థితుల్లో ఆదివాసీలు దుర్భర జీవితాలు గడిపేందుకు కారణం భారత ప్రభుత్వ విధానాలు. ఇప్పుడు అధికారాన్ని అనుభవిస్తున్న యూపీఏ, దాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఒకప్పుడు మావోయిస్టులది సామాజిక సమస్య అనే ప్రకటించింది. ఇప్పుడు మాత్రం శాంతిభద్రతల సమస్యగానే చూస్తుంది. మావోయిస్టులు చెప్పేది సమసమాజ స్థాపనే తమ ధ్యేయమని. ఇప్పటి పాలకులు సమసమాజాన్ని విస్మరించారు కాబట్టే అది తాము నిర్మిస్తామని వారు పేర్కొంటున్నారు. మావోయిస్టులు కలలు కంటున్న సమ సమాజ స్థాపన సంగతి పక్కనబెడితే ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత పాలకులది. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో గల గొత్తికోయలకు ప్రజాస్వామిక హక్కులేమి వర్తించవు. వారు పౌరులే కాదన్నట్లుగా వ్యవహరిస్తుంది భారత ప్రభుత్వం. దండకారణ్యంలోకి ప్రవేశించలేని పోలీసు బలగాలు గిరిజనులకు తుపాకులిచ్చి ప్రజల్ను చంపించడాన్ని భారత సర్వోనత న్యాయస్థానం తప్పుపట్టే వరకూ వీరి అకృత్యాలు ఆగలేదు. సుప్రీం తీర్పుతో ఎస్పీవో (స్పెషల్‌ పోలీసు ఆఫీసర్‌) వ్యవస్థ లేకుండా పోయిందనడానికి లేదు. దాని రూపశిల్పి మహేంద్రకర్మకు ప్రభుత్వ జడ్‌ కేటగిరి భద్రత కల్పించింది. మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా అతడు చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండదండలు అందించింది. దాని మాటున సాగుతున్న అప్రజాస్వామిక చర్యలను మాత్రం పట్టించుకోలేదు. మహేంద్రకర్మ తయారు చేసిన ప్రైవేటు బలగాలు, సీఆర్పీఎఫ్‌ బలగాలు ఆదివాసీలపై సాగించిన అత్యాచారాలు, హత్యలు ప్రజాస్వామికి మాయని మచ్చకానేకావు అనేది కాంగ్రెస్‌ పార్టీ అభిమతం. కాంగ్రెస్‌ నేతల హత్యలను ఈ సందర్భంగా ఎవరూ సమర్థించడం లేదు. కానీ అంతకుముందు మరో కోణం చోటు చేసుకున్న అకృత్యాల మాటేమిటనేదే ప్రశ్న. ఇది మాత్రమే ప్రజాస్వామ్యంపై దాడి అయినప్పుడు పౌరుల జీవించే హక్కును లాక్కోని వారి పెడరెక్కలు విరిసి కట్టేసి గొంతులు కోసినప్పుడు దానిని ఏమనాలి. దీనికి కాంగ్రెస్‌ పార్టీ, యూపీఏ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.