ఇది విపత్తు కాదా?

భానుడి భగభగలకు వందలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. అయినా వీరి మరణాలు పాలకులకు పట్టడం లేదు. ఇది ప్రకృతి విపత్తు కాదా? ఇలాంటి సమయంలో విపత్తుల నివారణ కమిటీ ఏం చేస్తోంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఎండల చండప్రచండానికి ప్రజలు పెద్ద సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. పశుపక్ష్యాదులకు ఇక లెక్కేలేదు. ఉష్ణమండలాన్ని తలపించేలా భూమండలం భగభగ మండుతోంది. తపాన్‌లు వచ్చినప్పుడు మాత్రమే అలర్ట్‌ అయ్యే సర్కార్‌, అధికారులు ఇప్పుడెందుకనో స్పందించలేదు. విపత్తు అంటే తుపాన్లు మాత్రమే అనుకున్నారని పరిస్థితులను బట్టి అర్థం అవుతోంది. ఆలస్యంగానైనా సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి పరిస్థితిని సమీక్షించి తగు జాగ్రత్తుల తీసుకోవాలని ఆదేశించారు. నిజానికి ఈ పని చేయాల్సింది విపత్తు నివారణ కమిషన్‌. దానికి ఛైర్మన్‌గా ఉన్న మన రాష్టాన్రికే చెందిన మర్రి శశిధర్‌ రెడ్డి కనీసం ఈ విసయంలో ఏ నివారణ చర్యలు తీసుకున్నారో తెలియదు. ఎండల తీవ్రత పెరుగుతున్నదని వాతావరణ శాఖ రోజూ బులిటెన్‌లు విడుదల చేస్తున్నా సీఎం స్పందించే వరకు విపత్తు నివారణశాఖ స్పందించకపోవం, ప్రజలను అప్రమత్తం చేయకపోవడం దారుణం. పదవులన్నీ ప్రజాసేవక తప్ప అధికారం అనుభవించడానికి కాదన్న నిజం గుర్తించాలి. గతంలో చరిత్రలో అశోకుడు చెట్లు నాటెను అన్న దగ్గర నుంచి అనేక మంచి పనులను చూశాం కాని ఇప్పుడు ప్రత్యేక విపత్తు నివారణ శాఖ పెట్టి మందీమార్బలాన్ని ఇచ్చినా చేసిందేమిటో పాలకులే తెలుసుకోవాలి. ఈ కాలం పాలకులు మాత్రం ఎండాకాలం వానాకాలం దైవాధీనాలని నమ్మి ఊరుకుంటున్నారు. ప్రకృతి విపత్తులు వచ్చినా తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోనందుకు మర్రి శశిధర్రెడ్డి సమాధానం ఇచ్చుకోవాలి. ప్రజలు అల్లాడి పోతున్నప్పటికీ, ఆదుకోవాలన్న స్పృహ ఉండకపోవడం దారుణాతి దారుణం. ప్రకృతి విపత్తులంటే తుఫాన్లు, భూకంపాలే కాదన్న అర్థం మారాలి. ఉప్పెనలాగా, భూకంపంలాగా ఏదో పెద్ద సంఘటన, పెద్ద సంఖ్యలో జననష్టం జరిగితే తప్ప, దాన్ని వైపరీత్యంగా భావించకూడదనే ధోరణి ఆధునిక పాలకులలో ఏర్పడిందనడానికి వడదెబ్బ మృతులే నిదర్శనం. ఇటీవలి కాలంలో విపత్తుల నిర్వహణ ఒక అంతర్జాతీయ చర్చనీయాంశంగా మారి, ప్రభుత్వాలు యంత్రాంగాలను ఏర్పాటు చేసి, వైపరీత్యాలను నిర్వచించాయి. ఉన్నంతలో సేవచేసే అవకాశం ఉన్నా చేయలేకపోవడం వల్ల పదవులను పట్టుకుని వేళాడే వారు వాటిని వదులుకోవడం మంచిది. గత వారం పదిరోజులులగా భానుడి తీక్షణతకు చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రజలు విలవిలలాడుతున్నారు. వడదెబ్బలకు పిట్టల్లా రాలిపోతున్నారు. బస్సులో బయలుదేరిన ఓ విద్యార్థి ఇంటికి చేరుకోకముందే బస్సులోనే ప్రాణాలు వదిలాడంటే ఎండ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలి. వడదెబ్బ మృతుల్లో అత్యధికులు పేద, మధ్యతరగతి వర్గాలకు చెందినవారేనని తెలుసుకోవడానికి పెద్ద కష్టపడనక్కరలేదు. ఎండలోనే గడపవలసిరావడం, పనిచేయవలసిరావడం వంటి వాటితో పాటు, విపరీత వాతావరణానికి తట్టుకోగలిగిన ఆరోగ్యం లేనివారే ఎండదెబ్బకు చనిపోతున్నారు. రోగనిరోధక శక్తి కానీ లేకపోవడానికి పోషకాహారలోపం కూడా కారణంగా భావించాలి. సంపన్నవర్గాల వారు ఎండావానల నుంచి చలినుంచి రక్షణ కోసం సొంతంగా చర్యలు తీసుకోగలరు. ఆ స్థోమత లేనివారే బాధితులు కాబట్టి ప్రభుత్వ బాధ్యత మరింత పెరుగుతుంది. గ్రీష్మతాపం, చండప్రచండ ఎండాకాలం ఈ ఒక్క ఏడాదితో ముగిసేది కాదని గుర్తిస్తే, దీర్ఘకాలిక చర్యల విషయమైనా ప్రభుత్వాలు ఆలోచించే ఆస్కారం ఉంటుంది. ఇది తప్పిదారిన వచ్చిన విపరీత వాతావరణం కాదు. రుతువులు గతి తప్పడానికి, అతిగా వర్తించడానికి మానవతప్పిదమే ప్రధాన కారణం. మనం నాశనం చేస్తున్న పచ్చదనం, అభివృద్ధి పేరిట మనం చేస్తున్న కాంక్రీట్‌ నిర్మాణాలు, అడుగంటి పోతున్న భూగర్భజలాలు, చెరువుల పూడ్చివేత, కాలుష్యకారక పరిశ్రమలు- మొత్తంగా మన సమాజ గమనమే ప్రకృతిని వికృతం చేసే దిశగా సాగుతోంది. ఈ క్రమానికి అడ్డుకట్ట వేయకపోతే, ఎక్కడో ఒక చోట ప్రకృతిని నాశనం చేసుకునే దుర్గతి ఏర్పడుతుంది. అప్పుడు బాధపడే బదులు ప్రకృతి విరుద్ధ పనులను ఆపాలి. భూగర్భ జలాల పెంపుదలకు కృషి చేయాలి. ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చి వాననీటిని ఒడిసిపట్టేలా చేసుకోవాలి. ప్రకృతి విలయమైనా, వరమైనా నచేతిలోనే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వాలు ఇది తమ బాధ్యతగానే గుర్తుంచుకోవాలి. ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముందే ప్రజలను అప్రమత్తం చేయాలి. పరీక్షలు తదితర అత్యవసర కార్యక్రమాలను వాయిదా వేయాలి. లేదా ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. పదవులపై ఉన్న శ్రధ్ద ప్రజల కోసం ఉండాలి. ప్రజలకు మేలుచేయగలిగే చర్యలకు ఆలోచన చేయాలి. ప్రకృతి విపత్తుల సమయంలో ఇకనైనా జాగరూకత పాటించాలి. ఎండాకాలం తీవ్రతను కూడా విపత్తుగా పరిగణించి కార్యాచరణకు దిగాలి. అలాచేయలేని వారు పదవులు వదులుకోవడం మంచిది.