నేడు మరోమారు మజ్లిస్‌ నేతల భేటీ

హైదరాబాద్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఉపసంహరించిన మజ్లిస్‌ పార్టీ బుధవారం మరోమారు సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించనుంది. మద్దతు ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత రాష్ట్రపతి, గవర్నర్‌లను కలవాలని భావించిన మజ్లిస్‌ నేతలు దీనిపై మరోసారి చర్చించాలని నిర్ణయించారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి బయటనుంచి మద్దతిసున్నందున రాష్ట్రపతిని కలిసి ఉపసంహరణ నిర్ణయాన్ని తెలియజేయాలని మజ్లిస్‌ ఇప్పటికే నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నేరుగా మద్దతివ్వడం లేదు కాబట్టి గవర్నర్‌ను కలవాల్సిన అవసరం లేదని పార్టీలోని ఓ వర్గం అభిప్రాయపడుతోంది. దీనిపై చర్చతోపాటు ముందుగా ప్రకటించిన విధంగా రాష్ట్ర పర్యటనకు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు. ఈమేరకు నాంపల్లి దారుసలాంలోని పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు మజ్లిస్‌ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. పార్టీ నేతల భేటీలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను ఈ సమావేశంలో వెల్లడిస్తారు.