ఇప్పుడు కేసీఆర్‌ను..  2019లో మోడీని ఇంటికి పంపుదాం


– మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని అప్పగిస్తే.. 2లక్షల కోట్ల అప్పులు చేశాడు
– రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై అప్పు ఉంది
– కానీ కేసీఆర్‌ కొడుకు ఆదాయం నాలుగొందల రెట్లు పెరిగింది
– ప్రాజెక్టుల రీడిజైన్‌ల పేరుతో దోపిడీకి పాల్పడ్డారు
– దేశ ప్రజల మధ్య వైషమ్యాలను మోడీ రెచ్చగొడుతున్నారు
– దానికి కేసీఆర్‌ మద్దతుగా నిలుస్తున్నాడు
– టీఆర్‌ఎస్‌ అంటే.. తెలంగాణ రాష్టీయ్ర సంఘ్‌ పరివార్‌
– మోదీని మళ్లీ ప్రధానిని చేయడమే కేసీఆర్‌ లక్ష్యమని ఆపార్టీ ఎంపీలే చెప్పారు
– రాఫెల్‌ కుంభకోణంపై మేం పోరాడుతుంటే.. టీఆర్‌ఎస్‌ ఎందుకు మౌనంగాఉంది?
– తెలంగాణలో కాంగ్రెస్‌ గాలి వీస్తోంది
– ప్రజాకూటమి అధికారంలోకి రావటం ఖాయం
– ప్రజా కలలకు అనుగుణంగా పాలన సాగిస్తాం
– కొస్గీ బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ
కొడంగల్‌, నవంబర్‌28(జనంసాక్షి) : దేశంలో మోడీ, తెలంగాణలో కేసీఆర్‌ నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజల కష్టాలు మరింత పెరిగాయని, ఇద్దరు నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోని కేసీఆర్‌ ఇప్పుడు, 2019లో మోడీని ఓటు ద్వారా బుద్దిచెప్పి ఇంటికి పంపుదామని రాహుల్‌ పిలుపునిచ్చారు. బుధవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం కొస్గీలో జరిగిన బహిరంగ సభలో రాహుల్‌ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటుతో కష్టాలు తీరుతాయని ప్రజలు భావించారని అన్నారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కేసీఆర్‌ వమ్ముచేశారని,  ప్రతి యువకుడు నిరాశ, అసంతృప్తితో ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌ రూ.17వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో మొదలైన తెలంగాణను 2లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని ఆరోపించారు. తెలంగాణలో ప్రతి వ్యక్తిపై అప్పు ఉంటే .. కేసీఆర్‌ కొడుకు ఆదాయం 4వందల రెట్లు పెరిగిందని విమర్శించారు. రూ.40 వేల కోట్ల ప్రాణహిత ప్రాజెక్టు వ్యయాన్ని 80వేల కోట్లకు పెంచారని, కేసీఆర్‌ ప్రాజెక్టు పేరు మార్చి 40 వేల కోట్ల దోపిడీ చేశారని రాహుల్‌ మండిపడ్డారు. లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్‌ ఎన్ని ఇచ్చాడో ఆలోచించాలని, కేసీఆర్‌ కుటుంబంలో నలుగురికి ఉద్యోగాలు వచ్చాయి తప్ప మహిళా సంఘాలకు కూడా కేసీఆర్‌ అన్యాయం చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష గ్రాంట్‌ ఇస్తామని, మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.500 కోట్లు కేటాయిస్తామని తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ ఎన్నో ఆశలు చూపారని అన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మిస్తామని చెప్పి మర్చిపోయారని, దళితులకు మూడు ఎకరాల భూమి హావిూ మోసంగా మారిందని రాహుల్‌ ఎద్దేవా చేశారు. ప్రజాకూటమి అధికారంలోకి రాగానే పేదలకు ఇళ్లు.. దళితులు, గిరిజనులకు భూమి ఇస్తామని, యువతకు ఉపాధి, నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తామని, తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని రాహుల్‌ భరోసా ఇచ్చారు.
మోడీ, కేసీఆర్‌లు ఒకే తాను ముక్కలు..
లోక్‌ సభ, రాజ్యసభలలో మోదీకి అవసరం వచ్చినప్పుడల్లా కేసీఆర్‌ పూర్తిగా మద్దతిచ్చారని రాహుల్‌ గాంధీ అన్నారు. దేశాన్ని విభజించే పనిలో మోదీ ఎప్పుడూ నిమగ్నమై ఉంటారని విమర్శించారు. దేశ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడతారని, వీటన్నింటికీ కేసీఆర్‌ మద్దతు ఉందని ఆరోపించారు. రైతులకు అనుకూలంగా ఉండే భూసేకరణ బిల్లుకోసం పార్లమెంటులో తాము పోరాటం చేస్తున్నప్పుడు కూడా, తమకు వ్యతిరేకంగా మోదీకి అనుకూలంగా టీఆర్‌ఎస్‌ ఎంపీలు వ్యవహరించారని రాహుల్‌ మండిపడ్డారు. పార్లమెంటులో ఆమోదం పొందిన ప్రతి బిల్లుకు నరేంద్ర మోదీకి కేసీఆర్‌ మద్దతు పలికారని విమర్శించారు. ఆరెస్సెస్‌, సంఘ్‌ పరివార్‌ కు కూడా కేసీఆర్‌ సంపూర్ణ మద్దతు పలికారని అన్నారు. టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదని… దాని పేరు తెలంగాణ రాష్టీయ్ర సంఘ్‌ పరివార్‌ అని ఎద్దేవా చేశారు. కొడంగల్‌ బహిరంగసభలో మాట్లాడుతూ, రాహుల్‌ ఈ మేరకు విమర్శలు గుప్పించారు.
పార్లమెంటులో ప్రతి బిల్లుకు మోదీకి ఎందుకు మద్దతు పలుకుతున్నారని తాను టీఆర్‌ఎస్‌ ఎంపీలను అడిగానని, కేసీఆర్‌ నుంచి తమకు ఆదేశాలు వచ్చాయని, అందుకే మద్దతు పలుకుతున్నామని తనతో వారు చెప్పారని రాహుల్‌ అన్నారు. మోదీని మళ్లీ ప్రధానమంత్రిని చేయడమే కేసీఆర్‌ లక్ష్యమని చెప్పారని రాహుల్‌ అన్నారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ రెండూ ఒకే తాను ముక్కలని మోదీ అన్నారు. పార్లమెంటులో రాఫెల్‌ కుంభకోణం వంటి ఎన్నో అంశాలనపై తాము పోరాడామని,  మరి తమతో టీఆర్‌ఎస్‌ ఎందుకు కలసి రాలేదని ప్రశ్నించారు. తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రాబోతోందని… విూ ఆకాంక్షలన్నింటినీ నెరవేర్చబోతోందని రాహుల్‌ చెప్పారు. వీరు కలలుగన్న నీళ్లు, నిధులు, నియామకాలను కాంగ్రెస్‌ పార్టీ నిజం చేస్తుందని అన్నారు. ముందు మనం ఇక్కడ కేసీఆర్‌ ను ఓడిద్దామని, 2019లో జాతీయ స్థాయిలో మోదీని ఇంటికి పంపుదామని రాహుల్‌ పిలుపునిచ్చారు.