ఇలాగైతే ఏపీకి మా సహకారం ఉండదు

4

– ఆర్డీఎస్‌పై కర్నూలు కలెక్టర్‌ లేఖను ఉపసంహరించుకోండి

– మంత్రి హరీశ్‌ డిమాండ్‌

హైదరాబాద్‌,మే17(జనంసాక్షి): ఆర్డీఎస్‌ పనులు నిలిపివేయాలంటూ రాయ్‌చూర్‌ కలెక్టర్‌కు కర్నూలు కలెక్టర్‌ రాసిన లేఖపై తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఇది తెలంగాణ వ్యతిరేక చర్య అని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై చర్చకు రాకుండా అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. తుంగభద్ర నదిపై నిరిస్తున్న రాజోలిబండ ప్రాజెక్టుపై చర్చలకు రావాలని ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును మరోసారి హరీష్‌ ఆహ్వానించారు. ఆర్డీఎస్‌ పనులు నిలిపివేయాలంటూ రాయ్‌చూర్‌ కలెక్టర్‌కు కర్నూలు కలెక్టర్‌ రాసిన లేఖను ఉపసంహరించుకోవాలని కోరారు. దీనిపై రెండ్రోజుల్లో సానుకూల నిర్ణయం రాకపోతే ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సహకారం ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఏపీ వైఖరిపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేస్తామన్నారు. రాజోలిబండ డైవర్షన్‌ స్కీం(ఆర్డీఎస్‌)ను అడ్డుకుంటున్నది చంద్రబాబే అని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. సచివాలయంలో హరీష్‌రావు విూడియాతో మాట్లాడుతూ.. ఆర్డీఎస్‌ను ఆపాలంటూ రాసిన లేఖను చంద్రబాబు ఉపసంహరించుకోవాలన్నారు. కర్నూలు జిల్లా ఆదోని ఆర్డీవో రాయచూర్‌ కలెక్టర్‌కు లేఖ రాశారని పేర్కొన్నారు. ఏపీ వైఖరిపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశామన్నారు. ఆర్డీఎస్‌కు 15.9 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయని గుర్తు చేశారు.  ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఆర్డీఎస్‌ పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఆర్డీఎస్‌ కింద 87,500 ఎకరాలు పారాల్సి ఉండగా, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల 20 వేల ఎకరాలకు కూడా నీరు పారలేదని తెలిపారు. ఆర్డీఎస్‌ పనుల కోసం గత ప్రభుత్వం కర్ణాటకలో రూ. 72 కోట్లు ఇచ్చింది, కానీ ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టు కాదని స్పష్టం చేశారు. పాలమూరు, డిండి పథకాలు గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ప్రకారమే నిర్మించడం జరుగుతుందన్నారు.