ఇలా ముక్కలుగా కట్‌చేస్తాం..
– పైశాచిక పుట్టినరోజు ఆనందం
ముంబై,జూన్ 14(జనంసాక్షి):మహరాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే 48వ పుట్టిన రోజు కార్యక్రమంలో తనదైన తీరును ప్రదర్శించారు. అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఆయన..ఆయన మద్దతుదారులు తెచ్చిన ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చిత్రంతోకూడిన కేక్ ను ముందుగా పీకదగ్గర కట్ చేసి, తన శైలిని చాటుకున్నారు. మహరాష్ట్రకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని సైతం ఇలా కేక్ ముక్కల్లా కట్ చేస్తామని కూడ రాజ్ థాకరే అన్నట్లు తెలుస్తోంది.ముంబై దాదర్ లోని తన నివాసం కృష్ణ కుంజ్ లో పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న రాజ్ థాకరే… అసదుద్దీన్ ఫొటోతో కూడిన కేక్ ను కట్ చేసి తనదైన శైలిలో మరోసారి వివాదానికి తెరతీశారు. తాను కట్ చేసిన కేక్ ను అభిమానులందరికీ పంచిన ఆయన… మహరాష్ట్రను వ్యతిరేకించేవారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన మెడవిూద కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అనేది లేదని చెప్పిన ఒవైసీ పై గతంలో మండిపడ్డ థాకరే.. పార్టీ నిర్వహిస్తున్న మొదటి గుడిపడ్వా ర్యాలీ సందర్భంగా చిత్రంలోని ఒవైసీ మెడపై కత్తిపెట్టి కేక్ కట్ చేశారు. ఇదిలా ఉంటే అసదుద్దీన్ కేక్ ను కట్ చేసిన ఘటనను ఏఐఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ ఖండించారు. కేక్ కట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు