ఇవిగో… మోదీ విద్యార్హతలు
– వెల్లడించిన అమిత్ షా
న్యూఢిల్లీ,మే9(జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్హత వివరాలు బహిర్గతమయ్యాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని విద్యార్హతల వివరాలు వెల్లడించారు. ఆయన బీఏ డిగ్రీతో పాటు పిజి కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. మోదీ విద్యార్హత గురించి అబద్ధాలు చెప్పిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ బీఏను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో.. రాజనీతి శాస్త్రంలో ఉన్నత విద్యను గుజరాత్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారని
వెల్లడించారు. ‘ఒకరి వ్యక్తిగత విషయంపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసేముందు ఒకసారి ఆలోచించుకోవాలి. నిజనిజాలు ఏమిటో తెలుసుకోవాలి. మోదీ విద్యార్హతలను నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన ఒక రోజు వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. దేశానికి అరవింద్ కేజీవ్రాల్ క్షమాపణలు చెప్పాలి’ అని అమిత్ షా అన్నారు. ఢిల్లీలో మోదీ బీఏ పూర్తి చేశారన్నది అవాస్తవం అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విద్యార్హతల్ని భాజపా అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలు కలిసి సోమవారం వెల్లడించారు. దిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వీరు సంబంధిత వివరాల్ని తెలిపారు. మోదీ దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి బీఏ, గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పూర్తి చేసినట్లు ఆధారాలతో సహా వెల్లడించారు. ఇటీవల దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ మోదీ విద్యార్హతలపై ఆరోపణలు చేయడంతో వీరు పై మేరకు స్పష్టతనిచ్చారు.
నిరాధార ఆరోపణలు చేసిన కేజీవ్రాల్ మోదీకి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ప్రధాని విద్యార్హతలపై ఇలా స్పష్టతనివ్వాల్సి రావడం దురదృష్టకరమమన్నారు. త్వరలోనే ప్రధాని డిగ్రీలకు సంబంధించిన కాపీలు విూడియాకు అందుతాయని చెప్పారు. 2014లో ఎన్నికల అఫిడవిట్‌లోనూ మోదీ ఇదే విషయాన్ని పేర్కొన్నారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు రెండూ తనకు ఉన్నట్లు అందులో స్పష్టం చేశారు. 1978లో దిల్లీ విశ్వవిద్యాలయంలో దూర విద్య ద్వారా పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసినట్లు ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.